పోటాపోటీగా ఎన్నికల ప్రచారంశ్రీ దూసుకుపోతున్న వైసిపిశ్రీ ఉనికి చాటుకుంటున్న టిడిపిశ్రీ కనిపించని బిసివై పార్టీ

Mar 26,2024 22:00
పోటాపోటీగా ఎన్నికల ప్రచారంశ్రీ దూసుకుపోతున్న వైసిపిశ్రీ ఉనికి చాటుకుంటున్న టిడిపిశ్రీ కనిపించని బిసివై పార్టీ

ప్రజాశక్తి- సోమల రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చిన రోజు నుండి రాజకీయ పార్టీల ప్రచార కార్యక్రమాలు మిన్నంటాయి. ఒకరిపై ఒకరు పోటీ పడుతూ ప్రచారం చేస్తూ తమ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తూ ప్రచారాన్ని చేస్తున్నారు. గతంలో ఎన్నికల సంఘం నియమావళిని ప్రతి ఎన్నికల సమరంలోనూ అప్పటి పరిస్థితులను బట్టి కఠినతరం చేస్తూ రావడం ప్రచారం చేసే విధానంలోనూ నూతన సవరణలు చేస్తూ ప్రకటిస్తూ ఉండడంతో గతంలో లౌడ్‌ స్పీకర్లు హోరు, పార్టీ జెండాల జోరు, గోడలపై రాతలు ఆయా పార్టీల కార్యకర్తలు మండల స్థాయి నాయకులు నియోజకవర్గ స్థాయి నాయకులు ప్రచారం కోసం హడావిడి చేస్తూ తిరుగుతూ ఎన్నికలు దగ్గర పడే కొద్ది మరింత ఉత్సాహంగా ప్రచారం చేసేవారు. అయితే రానురాను ఎన్నికల నియమావళి ప్రకారం నడుచుకోవాల్సి రావడం కఠిన నియమాలు అమలుకావడంతో చాలావరకు పైవన్నీ కనుమరుగయ్యాయి. తక్కువ సమయంలోనే ప్రచారం చేయాల్సి రావడం తక్కువ వ్యయం ఖర్చు చేయాల్సిన కారణంగా నాయకులు క్షేత్రస్థాయిలోని కార్యకర్తలపై పూర్తిగా ఆధారపడి ప్రచార కార్యక్రమాలను వారికి అప్పగించి అప్పుడప్పుడు అభ్యర్థి రావడం ప్రచారంలో పాల్గొనడం నేడు జరుగుతోంది. కాగా మండలంలో వైఎస్‌ఆర్సిపి నాయకులు కార్యకర్తలు రెట్టించిన ఉత్సాహంతో రోజు పల్లెలో ప్రచారం నిర్వహిస్తున్నారు. మరొక్కసారి జగన్‌కు అవకాశం ఇవ్వాలని, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ముమ్మరంగా ప్రచారం చేస్తూ వస్తున్నారు. ఈనేపథ్యంలోనే బైక్‌ ర్యాలీలు, ఆలయాల్లో పూజలు, గ్రామాల్లో రాత్రి వేళల్లో ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇక తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చల్లా బాబు ఈనెల 17వ తేదీ ఆదివారం సోమల పంచాయతీలో ప్రచారం నిర్వహించారు. ఆ తర్వాత మండలంలోని టిడిపి శ్రేణులు ఎక్కడా ప్రచారాలు నిర్వహిస్తున్న ఆనవాళ్లు కానీ హంగామాకానీ కనిపించలేదు. టిడిపి కేవలం ఉనికిని చాటుకునేందుకు ఒక్కరోజు పర్యటనలో భాగంగా ప్రచారం జరిగిందే తప్ప ఆ తర్వాత ఆ పార్టీకి సంబంధించి ఎలాంటి ప్రచార కార్యక్రమాలు చేపట్టలేదని అనిపిస్తుంది. భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్‌ కూడా మండలంలో ఎక్కడా ఇంతవరకు ప్రచారం నిర్వహించలేదు. తన అభిమానులు, కార్యకర్తలు మండలంలో ఎక్కడా కరపత్రాలు చేత పట్టి ప్రచారం చేసిన దాఖలాలు లేవు. పోలింగ్‌ తేదీ దగ్గర పడే కొద్ది ఏఏ పార్టీలు ఎంత మేర ప్రచారాన్ని చేసి తమ నాయకులను గెలిపించుకుంటారన్నది వేచి చూడాల్సిందే.

➡️