సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా…మ్రోగిన సమ్మె సైరన్‌

Dec 20,2023 22:18

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: బండెడు చాకిరీ… బిత్తెడు జీతం… నెలాఖరుకు జీతం వచ్చే పరిస్థితి లేదు.. ఏండ్ల తరబడీ పనిచేస్తున్నా పెరగని జీతం.. ఇదీ సమగ్రశిక్ష ఉద్యోగుల పరిస్థితి. మహాపాదయాత్రలో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను పర్మినెంట్‌ చేస్తామన్న జగన్‌ హామీ హామీగానే మిగిలిపోయింది. నాలుగున్నర ఏండ్ల పాటు జగన్‌మ్మోహన్‌రెడ్డిపై నమ్మకం పెట్టుకున్న ఉద్యోగుల నమ్మకం సడలింది. ఎన్నికలోచ్చేస్తున్నాయి.. నేడో.. రోపో.. ఎన్నికల నోఫికేషన్‌ విడుదలకానుంది. ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు అంటూ సమగ్ర శిక్ష అభియాన్‌లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సమ్మె సైరన్‌ మ్రోగించారు. బుధవారం నుండీ రాష్ట్రవ్యాప్తంగా విధులు బహిష్కిరించి సమ్మెకు పూనుకున్నారు. చిత్తూరు జిల్లాలో సమగ్రశిక్షా అభియాన్‌లో వివిధ విభాగాల్లో 300మంది కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులుగా పని చేస్తున్నారు. బారేడు చాకిరీ.. బిత్తెడు జీతం ..సమగ్ర శిక్షా అభియాన్‌లో పనిచేస్తున్న కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు ఇచ్చే జీతం బిత్తెడు, చాకిరీ బారెడు. డిగ్రీలు, డీఈడీలు చేసిన నిరుద్యోగులు కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులుగా సమగ్రశిక్షా అభియాన్‌లో చేరారు. ఉద్యోగంలో చేరి 12 నుంచి 15 సంవత్సరాలు గడుస్తున్నా ఇచ్చే జీతంలో మార్పులే నెలకు రూ.20వేలు జీతం ఇస్తున్నా పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో పోల్చితే ఏమాత్రం సరిపొదు. ఉద్యోగభద్రత లేకపోవడంతో ఎప్పుడైనే తొలగించవచ్చు. కేజీబివి టీచర్స్‌కు అరకొర జీతాలు పెంచినా అమలు నోచుకోవడం లేదు. సమగ్ర శిక్షా అబియాన్‌లో పనిచేస్తున్న ఎంఐఎస్‌ కోఆర్డినేటర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, సిఆర్‌పిఎస్‌లు, పార్టుటైం ఇన్‌స్టెటర్లు, మెస్జర్లు, ఐఈఆర్‌పిలుగా పనిచేస్తున్నారు. కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో పనిచేస్తున్న వీరికి ఎలాంటి ఉద్యోగ భద్రత లేదు.పాదయాత్ర హామీ గాలికి..మహాపాదయాత్ర సందర్భంగా అప్పటి ప్రతిపక్షనేత జగన్‌మోహ్మన్‌రెడ్డి సమగ్ర శిక్షా అభియాన్‌లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను పర్మినెంట్‌ చేస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి నాలుగున్నరేండ్లు గడుస్తున్నా పట్టించుకోకపోవడంతో సమగ్ర శిక్షా అభియాన్‌లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు సమ్మె సైరన్‌ మ్రోగించారు. బుధవారం నుండీ రాష్ట్రవ్యాప్తంగా సమ్మెకు పూనుకున్నారు. చిత్తూరు జిల్లాలో పనిచేస్తున్న వారంతా విధులను బహిష్కరించి జిల్లా విద్యాశాఖ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. తమ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించేత వరకు సమ్మెను కొనసాగిస్తామని సమగ్రశిక్షా అభియాన్‌ కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల జేఏసి నాయకులు శ్రీనివాసయాదవ్‌, విల్వనాధం స్పష్టం చేశారు. జిల్లా విద్యాశాఖ కార్యాలయం ఎదుట నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న ఉద్యోగులు వందల సంఖ్యలో పాల్గొన్నారు. సమగ్ర శిక్షా అభియాన్‌ ఉద్యోగుల పోరాటానికి సిఐటియు జిల్లా అధ్యక్షులు చైతన్య, సిఐటియు నాయకులు జ్యోతి, ఎస్‌టియు రాష్ట్ర నాయకులు గంటా మోహన్‌ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వ సానుకూలంగా స్పందించి పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యోగుల డిమాండ్స్‌ ఇవే….సమగ్ర శిక్షా అభియాన్‌లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను క్రమబద్ధీకరించి విద్యాశాఖలో విలీనం చేయాలి. ఉద్యోగ భద్రత కల్పించాలి, పిఆర్‌సి ప్రకారం హెచ్‌ఆర్‌ పాలసీ అమలు, కనీస వేతనాలు అమలు చేయాలి, పార్టుటైం విధానాన్ని రద్దుచేసి పుల్‌టైం కాంట్రాక్టు విధానం అమలు, రూ.10లక్షల రిటైర్మెంట్‌ బెనిఫిట్‌, గ్రాట్యూటీ అమలు, పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంపు, వేతనాలతో కూడిన మెడికల్‌ సెలవులు, ఉద్యోగుల ఖాళీలు భర్తీ, జాబ్‌ చార్టు అమలు, రూ.20లక్షలకు పెంచి పెండింగ్‌ ఎక్స్‌గ్రేషియో చెల్లింపు, కారుణ్య నియామకాలు, మహిళా ఉద్యోగులకు 180 రోజులు ఏడాదికి ప్రసూతి సెలవులు, మండల స్థాయిలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఎంఈఒల ద్వారా జీతాలు చెల్లింపు వంటి డిమాండ్ల సాధన కోసం సమగ్రశిక్షా అభియాన్‌లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు బుధవారం నుండీ విధులను బహిష్కరించి నిరవధిక సమ్మెకు పూనుకున్నారు. ఎస్‌ఆర్‌ పురం: మండలంలోని విద్యాశాఖ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్న సమగ్ర శిక్ష సిబ్బంది సమ్మె చేయడానికి సిద్ధమయ్యారు. దీంతో స్థానిక మండల విద్యాశాఖ అధికారులు అరుణాచలం రెడ్డి, సబర్మతిలకు సమ్మె నోటీసును సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి, వెంటనే రెగ్యూలైజేషన్‌ చేయాలని, పెండ్డింగ్‌లో వున్నా వేతనాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. సమగ్ర శిక్ష సిబ్బంది సమ్మెలో పాల్గొనడంతో అధికారులే అటెండర్‌ విధులను కూడా చేసుకుంటున్నారు. డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఎంఐఎస్‌ కోఆర్డినేటర్‌, సిఆర్‌ఎంటిలు, పిటిఐలు మెసెంజర్‌ సమ్మెలో పాల్గొన్నారు.

➡️