16న బంద్‌ను జయప్రదం చేయండి

Feb 14,2024 21:27
16న బంద్‌ను జయప్రదం చేయండి

కార్మిక, కర్షక సంఘాల బైక్‌ ర్యాలీప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ వైఖరిని వ్యతిరేకించండి.. 16వ తేదీ జరుగుతున్న ఆల్‌ ఇండియా బంద్‌ను జయప్రదం చేయాలని సిఐటియు, ఏఐటియుసి నాయకులు స్కూటర్‌ ర్యాలీలో పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక గాంధీ విగ్రహం వద్ద ప్రారంభమై శాషాపిరణ్‌ వీధి, బజార్‌ వీధి, మార్కెట్‌, చర్చి వీధిలో స్కూటర్‌ ర్యాలీ చేస్తూ 16వ తేదీన జరుగుతున్న ఆల్‌ ఇండియా బంద్‌ను జయప్రదం చేయాలని నినాదాలు చేశారు. ఈ బంద్‌కు వ్యాపారస్తులు, ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ స్కూటర్‌ ర్యాలీ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కాంజీవరం సురేంద్రన్‌, జిల్లా అధ్యక్షులు పి.చైతన్యలు, ఏఐటియుసి జిల్లా గౌరవాధ్యక్షులు ఎస్‌.నాగరాజన్‌ మాట్లాడుతూ దేశంలో ఉన్న బడాబడా పెట్టుబడిదారులకు బహుళజాతి కంపెనీలకు నరేంద్ర మోడీ వత్తాసు పలకడం, కార్మికులకు రైతులకు ట్రాన్స్‌పోర్ట్‌ కార్మికులకు వ్యతిరేకమైన చట్టాలు తీసుకుని రావడం హేయమని అన్నారు. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, వాటిని నివారించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. అందుకోసం స్వామినాథన్‌ సిఫార్సులు ప్రకారం రైతులకు మద్దతు ధరలు ఇన్పుట్‌ సబ్సిడీలు ఇవ్వాలని తెలిపారు. కార్మికులకు ఎంతో ఉపయోగపడిన చట్టాలను తగ్గించి నాలుగు లేబర్‌ కోడ్లుగా తీసుకొని రావడం దారుణమన్నారు. జీఎస్టీ పన్నులను తగ్గించాలని, చిన్న తప్పులకు పెద్ద శిక్షలు వేసే విధంగా ట్రాన్స్పోర్ట్‌ చట్టాన్ని తీసుకుని రావడం నిరంకుశత్వానికి నిదర్శనం అన్నారు. దేశంలో రైతులు, వ్యవసాయ కార్మికులు, పారిశ్రామిక కార్మికులు, ట్రాన్స్పోర్ట్‌ డ్రైవర్లు ఉపాధి హామీ పథకం కార్మికులు వ్యాపారస్తులు అన్ని వర్గాల ప్రజలు నరేంద్ర మోడీ పరిపాలనలో అష్ట కష్టాలు పడుతున్నారని, బిజెపి ప్రభుత్వానికి బుద్ధి వచ్చేలా దేశవ్యాప్తంగా గ్రామీణ బంద్‌ను పారిశ్రామిక బంద్‌, ట్రాన్స్పోర్ట్‌ బందును జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు. చిత్తూరు నగరంలో కూడా వ్యాపారస్తులు, విద్యాసంస్థలు, ఆటో కార్మికులు, సినిమా థియేటర్లు, బియ్యం వ్యాపారస్తులు, వస్త్రదుకాణదారులు అందరూ ఈ16వ తారీఖు జరుగుతున్న బంద్‌ను జయప్రదం చేయుటకు సహకరిస్తారని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి బుద్ధి వచ్చేలా విధంగా గట్టిగా బంద్‌ చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు వాడ గంగరాజు, ఆరోగ్య దాసు, ఏఐటియుసి నగర అధ్యక్షులు దాసరి చంద్ర, జయశంకర్‌, రఘు, సురేష్‌, మంజుల, బిల్డింగ్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి జ్యోతిరావు, హమాలీ నాయకులు పలని తదితరులు పాల్గొన్నారు.

➡️