అతిసార నిర్మూలనకు శుభ్రతే కీలకం

ప్రజాశక్తి – రాయచోటి అతిసార నిర్మూలనకు పరిశుభ్రత, నాణ్యమైన నీటి సరఫరాలే కీలక మని జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌ పేర్కొన్నారు. శనివారం ఉదయం స్థానిక కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌లో అతిసార వ్యాధి నిర్మూలన ప్రచార కార్యక్రమం – 2024 పై జెసి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, పంచాయతీ శాఖ, గ్రామీణ నీటి సరఫరా, విద్య, ఐసిడిఎస్‌, మున్సిపల్‌ తదితర శాఖల అధికా రులతో జిల్లా స్థాయి టాస్క్‌ ఫోర్స్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ అతిసార ఇప్పటికీ దేశంలో ముఖ్యమైన ప్రజారోగ్య సమస్యగా ఉందని, శాంపుల్‌ రిజిస్ట్రేషన్‌ సిస్టం ప్రకారం మన దేశంలో ఐదు సంవత్సరాల లోపు పిల్లలలో 5.8 శాతం పిల్లలు అతిసార వల్ల చనిపోతున్నారన్నారు. ఈ నేపథ్యంలో అతిసార వ్యాధిని పూర్తిగా అరికట్టడానికి విద్య, వైద్య, గ్రామీణ నీటి సరఫరా, మున్సిపాలిటీ, తదితర శాఖల సమన్వయం ఎంతో అవసరమని తెలిపారు. అనంతరం వివిధ శాఖల జిల్లా అధికారులతో అతిసార వ్యాధి నిర్మూలనకు తీసుకోబోయే చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఒక్కొక్క శాఖ తీసుకోవాల్సిన చర్యల గురించి వివిధ సూచనలను చేశారు. అతిసార వ్యాధి ఏ విధంగా వ్యాపిస్తుందో ప్రజలందరికీ తెలియపరిచేలా అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని, చికిత్సకు అవసరమైన మాత్రలు, మందులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని సూచించారు. జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలలో ఒఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, విటమిన్‌ మాత్రలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే తల్లిదండ్రులకు ఈ వ్యాధి గురించి అవగాహన కల్పించాలన్నారు. అంగన్వాడీ కేంద్రాలలో ఉపయోగించే నీరు సురక్షితమైనదిగా ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు . అతిసార వ్యాధి కార్యక్రమంపై పిల్లలందరికీ అవగాహన కల్పించి పిల్లలకు వ్యాసరచన పోటీలను నిర్వహించాలన్నారు. అతిసారపై ఒక వీడియోను రూపొందించి పిల్లలందరికీ చూపించాలని ఆదేశించారు. మధ్యాహ్న భోజన పథకంలో వాడే నీరు సురక్షితంగా ఉండేలా చూసుకోవాలన్నారు. జిల్లాలోని అన్ని నీటి సరఫరా పైప్‌లైన్లలో ఎటువంటి కాలుష్యం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలలోని ప్రభుత్వ భవనాలలో నీటి నిలువ లేకుండా చూసుకోవాలన్నారు. జిల్లాలోని అన్ని మండల కేంద్రాలలో ఆర్‌ఒ ప్లాంట్లు, నీటి సరఫరా పైప్‌ లైన్లు శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి శాఖలో ఒక అధికారిని నోడల్‌ అధికారిగా నియమించి కార్యక్రమంపై సమన్వయ పరచుకొని అతిసార నిర్మూలనకు తగు చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం, జులై 1 నుంచి జూలై 31 వరకు జరగబోయే డెండీ వ్యతిరేక మాతోత్సవంపై పోస్టర్‌ ఆవిష్కరించారు. సమావేశంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

➡️