పారిశుధ్య నిర్వహణపై కలెక్టర్‌ ఆగ్రహం

Jun 26,2024 21:14

ప్రజాశక్తి-పాలకొండ: పాలకొండ నగర పంచాయతీలో పారిశుధ్య నిర్వహణపై జిల్లా కలెక్టర్‌ నిషాంత్‌ కుమార్‌ తీవ్ర స్థాయిలో ఆగ్రహం చెందారు. నగర పంచాయతీలో చిన్నకాపు వీధి, పెద్దకాపు వీధి ప్రాంతాల్లో బుధవారం ఆయన పర్యటించారు. మే నెలలో పారిశుధ్య పనులు చేపట్టాలని ఆదేశించినా ఇంతవరకు కాలువల్లోని పూడికలు తీయకపోవడంతో నగర పంచాయతీ కమిషనర్‌ సర్వేశ్వరరావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికులు కూడా పారిశుధ్య నిర్వహణ అధ్వానంగా ఉందని కలెక్టర్‌ దృష్టికి తీసుకురావడంతో ఆయన అధికారులపై మండిపడ్డారు. పారిశుధ్య నిర్వహణ పట్టించుకోకపోవడంపై కారణమేమిటని ఆయన నిలదీశారు. రెండు రోజులకు ఒకసారి తాగునీటిపై పరీక్షలు జరపాలని సూచించారు. కాలువల్లో పైపు లైన్లు ఉన్న కారణంగా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. అక్కడ నుంచి నీలమ్మకాలనీలో అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించారు. అక్కడి పిల్లలతో మాట్లాడారు. మీకు ఇస్తున్న ఆహారం బాగుందా? అని కలెక్టర్‌ అడుగగా, బాగుందని చిన్నారులు చెప్పడంతో ఆయన సంతృప్తి చెందారు. కలెక్టర్‌ వెంట ఆర్‌డిఒ రమణ ఉన్నారు.

➡️