షాపు అద్దెపై కౌన్సిల్‌లో దుమారం

Jun 29,2024 20:43

 వసూలు చేయకపోతే ఎసిబికి ఫిర్యాదు

సామాజిక మరుగుదొడ్డి కూల్చివేత పై చర్యలేవీ

మున్సిపల్‌ సమావేశంలో కౌన్సిలర్ల డిమాండ్‌

ప్రజాశక్తి – సాలూరు : స్థానిక మున్సిపల్‌ కార్యాలయం ఎదురుగా ఉన్న షాపింగ్‌ కాంప్లెక్స్‌లోని 20 నెంబర్‌ షాపు అద్దె గోల్‌ మాల్‌ వ్యవహారంపై కౌన్సిలర్లు ముక్తకంఠంతో ధ్వజమెత్తారు. చైర్‌పర్సన్‌ పువ్వుల ఈశ్వరమ్మ అధ్యక్షతన శనివారం నిర్వహించిన సాధారణ సమావేశంలో కౌన్సిలర్లు పలు సమస్యలపై అధికారులను నిలదీశారు. షాపు నెంబర్‌ 20లో అనేక ఏళ్లుగా ఉంటున్న యజమాని నుంచి ఎందుకు అద్దె డబ్బులు వసూలు చేయలేదని కౌన్సిలర్లు గిరిరఘు, రాపాక మాధవరావు, గొర్లి వెంకటరమణ, బి.శ్రీనివాసరావు, వైస్‌చైర్మన్లు వంగపండు అప్పలనాయుడు, జర్జాపు దీప్తి ప్రశ్నించారు. 2017 నుంచి తాను ఆ షాపులో ఉంటున్నానని యజమాని స్వయంగా మున్సిపల్‌ అధికారులతో కౌన్సిలర్లు పరిశీలనకు వెళ్లినప్పుడు చెప్పారని తెలిపారు. షాపు ఆయనకు కేటాయించినట్లు రూ.10వేలు చెల్లింపునకు సంబంధించిన రశీదు కూడా ఉందని చెప్పారు. రూ.11 లక్షలు షాపు యజమాని నుంచి వసూలు చేయాల్సి వుందని, ఎందుకు తాత్సారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. దీనికి సమాధానం చెప్పడానికి మున్సిపల్‌ మేనేజర్‌ రాఘవాచార్యులు, ఆర్‌ఐ శ్రీనివాసరావు నీళ్లు నమిలారు. షాపు అద్దె వ్యవహారంపై విచారణ జరిపినట్లు ఆర్‌ఐ శ్రీనివాసరావు చెప్పారు. విచారణలో ఏం తేలిందని నిలదీయగా విచారణాధికారి, టిపిఒ పద్మావతి మాట్లాడుతూ షాపు అద్దెకిచ్చినట్లు రికార్డుల్లో చూపించలేదని చెప్పారు. దీంతో కౌన్సిలర్లంతా భగ్గుమన్నారు. షాపు అద్దె విషయంలో కుంభకోణం జరిగినట్లు తెలుస్తోందని, అధికారులే బాధ్యత వహించాలని చెప్పారు. షాపు యజమాని నుంచి అద్దె డబ్బులు వసూలు కోసం ఆయనకు నోటీసు జారీ చేయాలని, లేకపోతే ఎసిబికి తామే ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. పట్టణంలోని గుమడాంలో మున్సిపల్‌ పాఠశాల పక్కన ఉన్న సామాజిక మరుగుదొడ్డిని ఎవరు కూల్చారో చెప్పాలని టిడిపి కౌన్సిలర్లు వి.హర్షవర్ధన్‌, టి.లక్ష్మోజీ, కె.వరలక్ష్మి డిమాండ్‌ చేశారు. రూ.3.5 లక్షలతో నిర్మించిన మరుగుదొడ్డి కూల్చివేతపై ఎందుకు ఫిర్యాదు చేయలేదని వారు నిలదీశారు. టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశామని, విచారణ జరుగుతుందని మేనేజర్‌ చెప్పారు. టిడిపి కౌన్సిలర్లు లేవనెత్తిన అంశాలకు వైసిపి కౌన్సిలర్లు కూడా మద్దతు పలికారు.కమిషనర్‌పై ధ్వజంమున్సిపల్‌ కమిషనర్‌ ప్రసన్న వాణిపై కౌన్సిలర్లు ధ్వజమెత్తారు. కమిషనర్‌ ప్రసన్న వాణి కార్యాలయంలో ఎప్పుడు ఉండేవారో, లేరో తెలిసేది కాదన్నారు. సమస్యలపై ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా స్పందించలేదని చెప్పారు. ఆమె సొంత కారులో తిరుగుతున్నప్పడు మున్సిపాలిటీ కారు అద్దె అలవెన్సులు ఎందుకివ్వాలని వైస్‌చైర్మన్‌ వంగపండు అప్పలనాయుడు, కౌన్సిలర్లు ప్రశ్నించారు. ఈ అంశాన్ని వాయిదా వేయాలని డిమాండ్‌ చేశారు.మౌనం వహించిన చైర్‌పర్సన్‌ మున్సిపల్‌ సమావేశం ఆద్యంతం చైర్‌పర్సన్‌ ఈశ్వరమ్మ మౌనం వహించడం చర్చనీ యాంశమైంది. కౌన్సిలర్లు అడిగిన ప్రశ్నలకు అధికా రులు సమాధానం చెప్పారు. కానీ నోరు మెదపలేదు.కార్మికుల జీతాలు చెల్లించలేని దుస్థితి బాధాకరం ఒకప్పుడు జాతీయ స్థాయిలో అవార్డు సాధించిన మున్సిపాలిటీలో ఈరోజు పారిశుధ్య కార్మికులకు జీతాలు చెల్లించలేని దుస్థితి రావడం బాధాకరం. పారిశుద్ధ్య కార్మికులు పనిచేయకపోతే పట్టణ ప్రజలు పరిశుభ్రత వాతావరణంలో ఉండలేరు. అసలే వర్షాకాలంలో వర్షాలు ఎక్కువగా పడుతున్నాయి, ఇలాంటి పరిస్థితుల్లో కార్మికులు సమ్మె చేస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి అని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి అన్నారు. శనివారం మున్సిపల్‌ సాధారణ సమావేశానికి ఆమె హాజరయ్యారు. తొలుత ఆమెకు చైర్‌పర్సన్‌ పువ్వుల ఈశ్వరమ్మ, వైస్‌ చైర్‌పర్సన్లు వంగపండు అప్పలనాయుడు, జర్జాపు దీప్తి, కౌన్సిలర్లు రాపాక మాధవరావు, గిరిరఘు, గొర్లి వెంకటరమణ, టిడిపి కౌన్సిలర్లు కొనిసి వరలక్ష్మి, వైదేహి కృష్ణారావు, ఇంఛార్జి కమిషనర్‌ శ్రీరామ్మూర్తి పుష్పగుచ్చం అందజేసి దుశ్శాలువా కప్పారు. అనంతరం మంత్రి సభ్యులందరికీ అభివాదం చేస్తూ వారి సీట్ల వద్దకు వెళ్ళారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టణ ప్రజలు అనూహ్య మెజారిటీతో తనను గెలిపించారని, రాజకీయాలకు అతీతంగా పట్టణాభివృద్ధికి కృషి చేద్దామని అన్నారు. మున్సిపాలిటీలో సామాజిక మరుగుదొడ్ల మరమ్మతు పనులకు నిధులు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్‌ను కోరానని, దీనికి ఆయన అంగీకరించారని తెలిపారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు కలెక్టర్‌కు పంపించాలని ఆదేశించారు. తాను రాష్ట్రానికి మంత్రినైనా నియోజకవర్గ ఆడపడుచునేనని చెప్పారు. సమస్యల పరిష్కారానికి తన వద్దకు ఎప్పుడొచ్చినా సహకరిస్తానని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మంజూరైన నిధులు కూడా అందుబాటులో ఉంచలేదని చెప్పారు. పట్టణంలోని ప్రభుత్వాసుపత్రిలో విద్యుత్‌ సరఫరాకు ఆటంకం లేకుండా వుండేందుకు ఆసుపత్రి వద్ద ట్రాన్స్‌ ఫార్మర్‌ ఏర్పాటు చేయాలని కోరినట్లు చెప్పారు. ఆమె సమావేశం నుంచి వెళ్లిపోయారు.

➡️