శ్రీరామరాజు పోరాటాల స్ఫూర్తితో ముందుకు సాగాలి : సిపిఎం జిల్లా కార్యదర్శి బలరాం

ప్రజాశక్తి – పాలకోడేరు (పశ్చిమ గోదావరి) : గాదిరాజు శ్రీరామరాజు చేసిన పోరాటాల స్ఫూర్తితో అంతా ముందుకు సాగాలని సిపిఎం జిల్లా కార్యదర్శి బి బలరాం పిలుపునిచ్చారు. సిపిఎం భీమవరం తాలూకా నాయకునిగా, గొల్లలకోడేరు గ్రామ సర్పంచిగా, రైతు సంఘ నాయకునిగా శ్రీరామ రాజు అందించిన సేవలు వెలకట్టలేమని అన్నారు. గొల్లల కోడేరు గ్రామంలో గాదిరాజు శ్రీరామరాజు 33వ వర్ధంతి వేడుకలు మంగళవారం నిర్వహించారు. శ్రీరామరాజు విగ్రహానికి జిల్లా కార్యదర్శి బలరాం, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జేఎన్వి గోకులం గోపాలన్‌, శ్రీరామరాజు కుమారులు సూర్యనారాయణ రాజు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభకు సిపిఎం మండల కార్యదర్శి శేషాపు ఆశ్రయ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా బలరాం మాట్లాడుతూ … ప్రజా సమస్యల పరిష్కారంలో శ్రీరామరాజు ఎనలేని కఅషి చేశారన్నారు. తుఫానులు వచ్చి రైతులు నష్టపోయిన సందర్భంలో ఆయన సేవలు మరువలేనని అన్నారు. నాడు భీమవరం తాలూకా లో సిపిఎం నాయకులుగా ప్రజలకు సేవ చేయడంతో పీడిత ప్రజలు మదిలో గుర్తుండిపోయారని అన్నారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు జె ఎన్వి గోపాలన్‌ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జక్కం శెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ …. నాటి పాలకులు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకపోతే ఎంతటి వారినైనా నిలదీసి అడిగేవారని కానీ నేటి పాలకులు ప్రజల సమస్యల కంటే కార్పొరేట్ల సంపద పెంచే పనుల్లో నిమగం అయ్యారని చెప్పారు. నాటి శ్రీరామరాజు స్ఫూర్తితో నేటి పాలకులను నిలదీసి పోరాటాలను నిర్వహించడమే శ్రీరామరాజుకు నిజమైన నివాళి అన్నారు. అనంతరం పాలకోడేరు ప్రజాసంఘాల కార్యాలయంలో గాదిరాజు శ్రీరామరాజు చిత్రపటానికి సిపిఎం మండల కార్యదర్శి శేసపు అశ్రీయ్య పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో శ్రీరామరాజుగారి కుమారుడు గాదిరాజు సూర్యనారాయణ రాజు, బత్తిన నాగేశ్వరరావు, చెల్లబోయిన సింహాచలం, కలిదిండి గోపాల రాజు, దున్న మరియమ్మ , కిలారు లక్ష్మి, షాలిని, కే జ్యోతి లు పాల్గొన్నారు.

➡️