సిపిఎంతోనే గిరిజనులకు రక్షణ

May 11,2024 21:49

ప్రజాశక్తి – కురుపాం :  సిపిఎంతోనే గిరిజన హక్కులకు రక్షణ అని కురుపాం నియోజకవర్గ సిపిఎం ఎమ్మెల్యే అభ్యర్థి మండంగి రమణ అన్నారు. రానున్న ఎన్నికల్లో ఇండియా బ్లాక్‌ బలపర్చిన సిపిఎం అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం మండలంలో వలసబల్లేరు పంచాయతీలో గల గిరిశిఖర గ్రామాలైన ఆగంగూడా, వలసగూడ, వెలగమానుగూడ, చాపరాయి గూడ, వలస బల్లేరు తదితర గిరిజన గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి తమకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిజెపి పదేళ్ల పాలనలో రాజ్యాంగానికి విరుద్ధంగా గిరిజనుల హక్కులైన అడవులను అటవీ ఫలసాయాలను దూరం చేస్తూ హక్కులను కాలరాసిందని అన్నారు. కావున గిరిజనులు హక్కులను కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఏజెన్సీలో గిరిజనులకు నూటికి నూరు శాతం ఉద్యోగ అవకాశాలు కల్పించే జీవో 3ను రద్దుచేసి గిరిజనులను ఉద్యోగాలకు బిజెపి దూరం చేసిందని, అటువంటి బిజెపి ప్రభుత్వానికి రాష్ట్రంలో ఉన్న పార్టీలు పోత్తులు తొత్తులుగా వ్యవహరిస్తున్నాయని అన్నారు. ఇటువంటి పార్టీలను సాగనింపి గిరిజనుల చట్ట సభల్లో వినిపిస్తేనే గిరిజనులకు న్యాయం జరుగుతుందని, కావున ఇండియా కూటమి బలపరిచిన సిపిఎం అభ్యర్థులకు మద్దతు ఇచ్చి సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ప్రచారంలో సిపిఎం నాయకులు టివి రమణ, కోరాడ ఈశ్వరరావు, అంగధ, వాసు తదితరులు పాల్గొన్నారు.

కూనేరు సంతలో సిపిఎం ప్రచారం

కొమరాడ : ఎర్రజెండా తరఫున పోటీ చేస్తున్న మండంగి రమణ, పాచిపెంట అప్పలనరసకు సుత్తీ, కొడవలి, నక్షత్రం గుర్తుపై ఓటేసి గెలిపించాలని కోరుతూ మండలంలోని కూనేరు సంతలో సిపిఎం నాయకులు ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీని ఉద్దేశించి రైతు కూలీ సంఘం రాష్ట్ర నాయకులు పి.శ్రీనునాయుడు, సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వాకాడ ఇందిర, కొల్లి సాంబమూర్తి మాట్లాడుతూ ఈరోజు గిరిజన హక్కులను కాలరాస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై ప్రతిరోజూ పోరాడుతున్న సిపిఎం ఎమ్మెల్యే, ఎంపి అభ్యర్థులు మండంగి రమణ, పి.అప్పలనరసికు అత్యధిక ఓట్లేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో రైతు కూలీ సంఘం నాయకులు మిన్నారావు, కృష్ణ, సోములు, సిపిఎం నాయకులు రామారావు, శివున్నాయుడు, నాగభూషణ, మధు, కైలాస్‌, దాలయ్య, లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.

సీతంపేట : మండలంలోని తుంబలి, తొంబలిగూడ, సిరికొండ, ఒబ్బంగి, దుంబెంగివలస, నేలిగండి, సులభంపాడు, ఈతమానుగూడ, పూతికవలస తదితర గ్రామాల్లో ప్రచారం చేపట్టారు. ఇండియా కూటమి సిపిఎం బలపర్చిన అరకు పార్లమెంట్‌ అభ్యర్థి పాచిపెంట అప్పలనరస అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, అలాగే కూటమి కాంగ్రెస్‌ అభ్యర్థి సవర చంటిబాబును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. గ్రామాల్లో బైక్‌ ర్యాలీ చేసి ప్రచారం వినూత్నంగా నిర్వహించారు. గిరిజనులకు అండగా సిపిఎం ఉంటుందన్నారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు గంగరాపు సింహాచలం, బాబూరావు, పి.వీరయ్య, పి.కుమార్‌, పత్తిక సలీం, కామేష్‌ తదితరులు పాల్గొన్నారు.

సాలూరు: ఇండియా వేదిక సిపిఎం ఎంపి అభ్యర్ధి పాచిపెంట అప్పలనర్సకు మద్దతుగా శనివారం ప్రజానాట్యమండలి కళాకారులు పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. శివాజీ బొమ్మ జంక్షన్‌లో కళాకారులు పాటలు పాడి అలరించారు. అప్పలనర్సకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. మోడీ ప్రభుత్వ విధానాలపై పాటలు పాడి ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎన్వైనాయుడు ఉన్నారు.

➡️