మతతత్వ బిజెపిని ఓడించి ఇండియా వేదిక అభ్యర్థులను గెలిపించండి

May 10,2024 18:30

 బైక్‌ ర్యాలీలో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు పుణ్యవతి

ప్రజాశక్తి – గుమ్మలక్ష్మీపురం : మే 13న జరగనున్న ఎన్నికల్లో ఇండియా వేదిక బలపర్చిన అభ్యర్థులను గెలిపించి మతతత్వ బిజెపిని ఇంటికి సాగనంపాలని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎస్‌.పుణ్యవతి పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం గుమ్మలక్ష్మీపురం, గరుగుబిల్లి, జియ్యమ్మవలస, సాలూరు మండలాల్లో సిపిఎం ఆధ్వర్యాన బైక్‌ ర్యాలీలు చేపట్టారు. గుమ్మలక్ష్మీపురంలో ర్యాలీని పుణ్యవతి, గరుగుబిల్లిలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.లోకనాధం ప్రారంభించారు. ఈ సందర్భంగా పుణ్యవతి మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో మతతత్వ బిజెపిని ఓడించి రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపైనా ఉందన్నారు. మోడీ పదేళ్ల పాలనలో రాజ్యాంగానికి విరుద్ధంగా పాలన సాగడంతో దేశం ప్రమాదంలో పడిందన్నారు. మతాలను, ప్రాంతాలను విభజించి ప్రజల మధ్య చిచ్చుపెట్టేలా బిజెపి వ్యవహరించి ందన్నారు. అమాయకులైన గిరిజనుల పట్ల వివక్షత చూపుతూ దాడులకు పాల్పడడం విచారకమన్నారు. రాజ్యాంగం గిరిజనులకు కల్పించిన హక్కులు, చట్టాలను పూర్తిగా నాశనం చేశారని మండిపడ్డారు. మరోవైపు అంబానీ ఆదాని వంటి కార్పొరేట్‌ వ్యక్తులతో చేతులు కలిపి పరిశ్రమల పేరుతో గిరిజనులను అడవి నుంచి దూరం చేసే కుట్ర జరుగుతోందన్నారు. గిరిజన సంఘం, సిపిఎం పోరాటాల ఫలితంగా సాధించుకున్న 1/70 చట్టం, అటవీ హక్కులు చట్టం, పీసా చట్టం, ఉపాధి హామీ చట్టాలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. జిఒ నెంబర్‌ 3ను ఎత్తివేయడంతో గిరిజనులకు ఉద్యోగ అవకాశాలు లేకుండా పోయాయన్నారు. ఐటిడిఎ, జిసిసి వంటి సంస్థలు ఉన్నా గిరిజనులకు ఎటువంటి ప్రయోజనమూ లేకుండా పోయిందన్నారు. భవిష్యత్తులో మరిన్ని ఉద్యమాలు చేసి హక్కులు, చట్టాలను కాపాడాల్సిన అవసరం ఎంతయినా ఉందన్నారు. ఇండియా వేదిక మద్దతుతో పోటీ చేస్తున్న సిపిఎం అరకు ఎంపి అభ్యర్థి అప్పలనర్సను, కురుపాం అసెంబ్లీ అభ్యర్థి మండంగి రమణను గెలిపించి చట్టసభలకు పంపించాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే అభ్యర్థి మండంగి రమణ మాట్లాడుతూ ఎమ్మెల్యేగా గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే గిరిజన ప్రాంత సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అంతకుముందు గుమ్మలక్ష్మీపురంలో కోరన్న, మంగన్న స్థూపం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం గుమ్మలక్ష్మీపురం నుంచి ఎల్విన్‌ పేట మీదుగా కుక్కిడి, డుమ్మంగి, కేదారిపురం, వంగర తదితర గ్రామాల్లో బైక్‌ ర్యాలీ సాగింది. కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సుబ్బరావమ్మ, విజయనగరం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రెడ్డి శంకర్రావు, పార్వతీపురం మన్యం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కోలక అవినాష్‌, సిఐటియు మండల కార్యదర్శి కె.గౌరీశ్వరరావు పాల్గొన్నారు.

➡️