బెదిరింపులకు భయపడొద్దు

Jun 29,2024 20:13

 కార్పొరేషన్‌ అధికారులతో ఎమ్మెల్యే అదితి

నగరాభివృద్ధికి సమన్వయంతో కృషి చేద్దాం

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  : విజయనగరం అభివృద్ధికి, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అధికారులు, పాలకవర్గం అంతా సమన్వయంతో కలిసి కషి చేద్దామని ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు అన్నారు. బెదిరింపులకు భయపడవద్దని అఆన్నరు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తొలిసారి నగరపాలక సంస్థ అధికారులతో శనివారం సమావేశం నిర్వహించారు. ముందుగా ఎమ్మెల్యేకు మేయర్‌ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్లు శ్రావణి, లయ యాదవ్‌, కమిషనర్‌ ఎంఎం నాయుడు పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు. అనంతరం జరిగిన సమావేశంలో ముందుగా అధికారులను, ఉద్యోగులను పరిచయం చేసుకున్నారు. అనంతరం ఇంజినీరింగ్‌ శాఖ, టౌన్‌ ప్లానింగ్‌ శాఖా, ప్రజారోగ్య శాఖ, రెవెన్యూ శాఖ పని తీరును, చేయాల్సిన పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నగర ప్రజలు తాగునీటికి ఇబ్బంది లేకుండా చూడాలని, విద్యుత్‌ అంతరాయం అధిగమించేందుకు కృషి చేద్దామని అన్నారు. కొన్ని ఫిర్యాదులు, బెదిరింపులు వస్తున్నాయని, వాటికి భయపడకుండా బాధ్యతతో పనిచేయాలని సూచించారు. నాణ్యమైన విద్యుత్‌ సరఫరా కోసం ఐదేళ్ల క్రితం గత పాలకవర్గం సమయంలో సోనీనగర్‌లో విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ నిర్మాణం కోసం ప్రతిపాదనలు తయారు చేస్తే దాన్ని గత వైసిపి పాలకులు బుట్టదాఖల చేశారన్నారు. ద్వారపూడి వద్ద సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్‌ను అదే విధంగా నిర్వీర్యం చేశారన్నారు. కేంద్రం సహకారంతో వీటిని పునరుద్దరిస్తామని తెలిపారు. ప్రజలు తన దృష్టికి వచ్చినవి మీకు తెలియచేసి వాటిని పరిష్కరించేందుకు కృషి చేద్దామన్నారు. అనంతరం దోమల నివారణకు ప్రజారోగ్య శాఖ ముద్రించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. సమావేశంలో మేయర్‌ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్లు శ్రావణి, లయ యాదవ్‌, కమిషనర్‌ ఎంఎం నాయుడు, పలుశాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

➡️