రాష్ట్రం, జిల్లాలో టూరిజం అభివృద్ధికి కృషి

Jun 30,2024 22:59
రాష్ట్రం, జిల్లాలో టూరిజం అభివృద్ధికి కృషి

ప్రజాశక్తి – నిడదవోలు జిల్లాలో పర్యాటక రంగం అభివృద్ధికి చాలా అవకాశాలు ఉన్నాయని ఆ దిశగా పర్యాటక రంగ అభివృద్ధికి కృషి చేస్తామని పర్యాటక సాంస్కృతిక సినిమా ఆటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్‌ పేర్కొన్నారు. ఆదివారం నిడదవోలు పట్టణం యర్నగూడెం రోడ్డులోని ఆనంద్‌ ఇన్‌ హోటల్‌లో పాత్రికేయుల సమావేశంలో మంత్రి దుర్గేష్‌ మాట్లాడారు. రాష్ట్రంలో దేశంలో టూరిజం అభివృద్ధి చెందిన పరిస్థితులను అవగాహన చేసుకుని మన ప్రాంతంలో ఆ దిశగా టూరిజాన్ని అభివృద్ధి చేస్తామన్నారుర. జిల్లాలో ఈ మధ్యనే పాపికొండల విహారయాత్ర ప్రారంభమైందని పర్యాటకులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సేఫ్టీ మెజర్‌ ఉండే విధంగా చర్యలు చేపడతామన్నారు. పాపికొండలు ప్రాంతాన్ని పరిశీలించేందుకు వెళుతున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు జూలై 1వ తేదీన ఎన్‌టిఆర్‌ భరోసా పెన్షన్‌ లబ్ధిదారులకు ఇంటి వద్దనే అందించేందుకు ఏర్పాట్లు చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు జూలై ఒకటవ తేదీన ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్‌ లబ్ధిదారులకు ఏప్రిల్‌, మే, జూన్‌ మాసాలకు రూ.3 వేలు కలుపుకుని జూలై మాసంలో అందించే రూ.4 వేలతో మొత్తం రూ.7 వేలను లబ్ధిదారులకు జూలై 1వ తేదీ ఉదయం 5 గంటల నుంచే లబ్ధిదారుల ఇంటి వద్దనే అందిస్తామన్నారు. పెంచిన పెన్షన్లతో ప్రభుత్వంపై ఆర్థిక భారం పడినప్పటికీ ప్రజా సంక్షేమమే లక్ష్యం అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్‌టిఆర్‌ జిల్లాలో పెన్షన్‌ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారని, డిప్యూటీ సిఎం పవన్‌ కళ్యాణ్‌ పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలులో పెన్షన్‌ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. తాను నిడదవోలు నియోజకవర్గం గోపవరంలో పెన్షన్‌ పంపిణీ కార్యక్రమానికి హాజరు అవుతానని తెలిపారు.రాష్ట్ర ఆర్థిక పరమైన అంశాల్లో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికే పోలవరం అంశానికి సంబంధించి శ్వేత పత్రాన్ని విడుదల చేశారని మంత్రి దుర్గేష్‌ తెలిపారు. గత ప్రభుత్వం ఎన్నికల ముందే రైతులకు ఆర్థిక సహాయాన్ని అందజేయలేదని తెలిపారు. రైతు సంక్షేమాన్ని కాంక్షించే ఈ ప్రభుత్వం త్వరలో రైతులకు ఆర్థిక సహాయాన్ని అందజేస్తామని తెలిపారు. ఇప్పటికే ఈ అంశంపై క్యాబినెట్‌లో చర్చించామన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం, స్పష్టమైన అవగాహన లేకపోవడంతో పోలవరం ప్రాజెక్టు అభివృద్ధికి నోచుకోలేదని మంత్రి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన వెంటనే యుద్ధ ప్రాతిపదికన పోలవరం ప్రాజెక్టును పరిశీలించారు. ఎక్కడ లోపాలు ఉన్నాయో గుర్తించి ప్రాజెక్ట్‌ పనులు వేగవంతం చేసేందుకు అంతర్జాతీయ సాంకేతిక నిపుణుల బృందం పరిశీలించేందుకు ఏర్పాట్లు చేస్తోందన్నారు. 2029 నాటికి పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తయ్యే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు. నిడదవోలులోని సామాజిక ఆసుపత్రిని ప్రస్తుతం ఉన్న 30 పడకల నుంచి 100 పడకలు చేసేందుకు చర్యలు చేపట్టినట్టు చెప్పారు. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శితో సంప్రదించామన్నారు. గోదావరి జలాల ద్వారా నిడదవోలు పట్టణానికి తాగునీటి సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు చేపడతామన్నారు. నియోజకవర్గంలో రహదారులు, డ్రైన్స్‌ అభివద్ధిపై ఇప్పటికే సంబంధిత మంత్రులతో చర్చించినట్లు మంత్రి తెలిపారు.గ్రామీణ, పట్టణ ప్రాంత ప్రజలకు పరిశుభ్రమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం జలజీవన్‌ మిషన్‌ ద్వారా మంజూరు చేసిన నిధులు గత ప్రభుత్వం వేరే కార్యక్రమాలకు మళ్లించడం వల్ల పథకం కార్యచరణ లక్ష్యానికి విఘాతం కలిగిందన్నారు. రాష్ట్ర డిప్యూటీ సిఎం కొణిదల పవన్‌ కళ్యాణ్‌ పిఠాపురం నియోజకవర్గంలో మూడు రోజులు పాటు పర్యటించనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ సమావేశంలో స్థానిక నాయకులు కొమ్మిన వెంకటేశ్వరరావు, బండి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు

➡️