సారా అమ్మకాలపై మహిళల ఆగ్రహం

Jun 29,2024 23:32
సారా అమ్మకాలపై మహిళల ఆగ్రహం

ప్రజాశక్తి – సీతానగరంనాటు సారా అమ్మకాలపై అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో మహిళలే ప్రతిఘటించి సారా ప్యాకెట్లను పోలీసులకు అప్పగించిన సంఘటన రఘుదేవపురంలో చోటు చేసుకుంది. వడ్డీల పేటలో 25 కుటుంబాలు నాటుసారా అమ్ముతూ తమ పిల్లల, కుటుంబ యజమానుల ఆరోగ్యంతో ఆడుకుంటున్నారని మహిళలు వాపోతున్నారు. స్థానిక పోలీసులకు, ఎస్‌ఇబి అధికారులకు తెలియజేసినా పూర్తిస్థాయిలో ప్రయోజనం లేకపోయిందని స్థానిక మహిళలు ఆవేదన వ్యక్తం చెందుతున్నారు. చివరికి చేసేది ఏమీ లేక ఎవరు నాటు సారా అమ్మినా వాళ్ల ఇళ్లలోకి చొరబడి సారా ప్యాకెట్లను బయటికి తీసుకుని వచ్చి పోలీసులకు అప్పగించారు. రఘుదేపురం గ్రామంలో వడ్డీల పేట మహిళల ఆవేదన చూసి జిల్లా అధికారులు స్పందించాలని మహిళా సంఘాలు కోరుతున్నాయి. వడ్డీల పేటలో ఇప్పటికే ఎంతోమంది సారాకి బానిసలై ప్రాణాలు కోల్పోయినట్టు వారు తెలిపారు. సారా అమ్మకాలపై ప్రశ్నిస్తే వ్యాపారులు దౌర్జన్యానికి దిగుతున్నారని మహిళలు కన్నీటి పర్యంతమయ్యారు. పోలీలు అధికారులు తక్షణమే స్పందించి సారా అమ్మకాలను నిరోధించాలని, లేకుంటే ఉద్యమం చేయడానికి వెనకాడబోమని మహిళలు హెచ్చరించారు.

➡️