ఈదురుగాలులు.. భారీ వర్షం

May 7,2024 23:01

ఉండ్రాజవరం ప్రధాన రహదారిపై విరిగిపడిన చెట్టు

ప్రజాశక్తి-యంత్రాంగం

ద్రోణి ప్రభావంతో మంగళవారం ఈదురుగాలులతో కూడిన భారీవర్షం కురిసింది. ఈదురుగాలులకు పలుచోట్ల చెట్లు నేలకూలాయి. పంటలు దెబ్బతిన్నాయి. కూరగాయల తోటలు నేలనంటాయి. విద్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. లోతట్లు ప్రాంతాలు,కాలనీలు, రహదారులు నీటితోనిండాయి. భారీ వర్షానికి జనజీవవనం స్తంభించింది. ఆత్రేయపురం: అల్పపీడన ప్రభావంతో మంగళవారం సాయంత్రం మండలంలోని గ్రామాలలో కురిసిన భారీ వర్షానికి మరియు ఈదురు గాలులకు జనజీవనం స్తంభించింది. బొబ్బర్లంక అమలాపురం వెళ్లే రోడ్లో చెట్లని విరిగిపోయి రోడ్డుమీద పడిపోవడంతో ట్రాఫిక్‌ ఎక్కడికి అక్కడ నిలిచిపోయింది. అలాగే తాడిపూడి లో విద్యుత్‌ స్తంభాలు విరిగిపోవడంతో ట్రాన్స్‌ఫాÛర్మర్లు నేలకొరిగాయి. అరటికీ అపర నష్టం వాటిల్లింది. అక్కడక్కడ అరటి తోటలు నేలకొరిగాయి. రైతులు రోడ్లపై ఆరబెట్టుకున్న ధాన్యాన్ని బరకాలు వేసినప్పటికీ గాలుల బీభత్సానికి బరకాలు ఎగిరిపోయి ధాన్యం తడిసి ముద్దయింది. గ్రామాలలో అక్కడక్కడ విద్యుత్‌ స్తంభాలు కూలిపోవడంతో విద్యుత్‌ అంతరాయం కలిగింది అకాల వర్షం రైతులకు నష్టం తెచ్చినప్పటికీ వేసవి నుండి ప్రజలు కాస్త ఉపశమనం పొందారు . రామచంద్రపురం: అకాల వర్షం వల్ల దాళ్వా రైతులకు నష్టం వాటిల్లింది. కె.గంగవరం మండలంలోని పలు గ్రామాల్లో ధాన్యం రాశులు నీట మునిగాయి. ఇప్పటికే 80 శాతం వరి కోతలు పూర్తి కాగా మరో 20 శాతం వరిచేలు కోత కు సిద్ధంగా ఉన్నాయి. అకాల వర్షంతో ధాన్యం రాశులు తడిసిపోవడంతో రైతన్నలు ఇక్కట్లకు గురయ్యారు. కోటిపల్లి లోని పలు వీధుల్లో వర్షం నీరు నిలిచిపోయి ఉండడంతో ప్రజలు ఇక్కట్ల గురయ్యారు. అయితే అకాల వర్షంతో ఒకేసారి ఉష్ణోగ్రతలు సాధారణ స్థితికి వచ్చాయి. కడియం: మండలం లో మంగళవారం మధ్యాహ్నం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో ఒక్కసారిగా వాతావరణం చల్ల బడింది. విద్యుత్‌ స్తంభాలు విరిగాయి, చెట్లుకూలాయి. విద్యుత్‌ సరఫరా నిలిపి పోయింది . వర్షం పడటంతో జన జీవనం స్తంభించింది. మండలం లోని కడియపు లంక పంచాయతీ పరిధి వెంకాయమ్మ పేటలో అయితరెడ్డి మహేష్‌ కు చెందిన నర్సరీలో కొబ్బరి చెట్టుపై పిడుగుపడింది. పెరవలి: మండలంలో ఈదురుగాలులకు, భారీ వర్షానికి పలు గ్రామాల్లో అరటి తోటలు, విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. మల్లేశ్వరం, ఖండవల్లి, ముక్కామల తీపర్రు, కానూరు గ్రామాల్లో అరటి తోటలు విరిగిపోవడంతో రైతులు ఆందోళన చెందారు. కొన్ని తోటలు గెలలు వేయడానికి సిద్ధంగా ఉన్న అరటి తోటలు విరిగిపోవటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉండ్రాజవరం: ఈదురు గాలులతో కూడిన భారీ వర్షానికి మండలంలో పలు ప్రాంతాలలో చెట్లు నేలకొరిగాయి. వాటితోపాటు విద్యుత్‌ లైన్లు తెగిపడ్డాయి. పలుచోట్ల చెట్లు విద్యుత్తు తీగలపై పడటంతో మండలంలో విద్యుత్‌ సరఫరా కు అంతరాయం కలిగింది. ఉండ్రాజవరం సుధీంద్రబాబు ఆశ్రమం వద్ద ప్రధాన రహదారిపై చెట్టు అడ్డంగా పడటంతో ట్రాఫిక్‌ కు ఇబ్బంది ఏర్పడింది. వెంటనే స్పందించిన అధికారులు చర్యలు తీసుకోవడంతో ట్రాఫిక్‌ సమస్య తీరింది. పలు గ్రామాలలో రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోయింది. రోడ్లపై ఆరబోసిన ధాన్యాన్ని రైతులు వడివడిగా సంచులలో నింపి, తడవకుండా జాగ్రత్త చేసుకున్నారు. అక్కడక్కడ అరటి చెట్లు విరిగిపడ్డాయి. మండల ప్రజలు సమయం సాయంత్రం ఏడు గంటలు దాటినప్పటికీ విద్యుత్‌ సరఫరా లేకపోవడంతో ప్రజలు చీకట్లోనే ఉండాల్సి వచ్చింది. ఆలమూరు: ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం రావడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అలాగే డ్రైన్లు పొంగి పోర్లాయి. అలాగే రైతులు తమ సాగు చేసిన పంటలు దెబ్బ తినడంతో భారీగా నష్టపోయారు. ఇందులో భాగంగా మండలంలోని లంక గ్రామాల్లో ముఖ్యంగా మడికి, బడుగువానిలంక, చెముడులంక, చొప్పెల్ల మూలస్థానం, జొన్నాడ, ఆలమూరు తదితర గ్రామాల పరిధిలోని ఉద్యానవన పంటలైన కోకో, అరటి తోటలు, దొండ, కాకర, కీర, వంగ, మిరప, వంటి వివిధ రకాల కూరగాయల తోటలు, పాదులు మొత్తం నేలమట్టం కాగా రైతన్నలు ఆవేదన చెందుతున్నారు. వరి పంట విషయానికి వస్తే గుమ్మిలేరు, మోదుకూరు, నర్సిపూడి, నవాబుపేట, పెనికేరు, కలవచర్ల, పెద్దపల్ల, పినపల్ల, సందిపూడి, చింతలూరు, సూర్యారావుపేటలలో సాగులో 50 శాతం వబ్బిడి కాగా 30 శాతం దాన్యం కల్లాల్లో ఉండిపోయింది. ఇంకా 20 శాతం వరి కోతలు జరగాల్సి ఉంది. దీంతో ఈ అకాల వర్షానికి అన్ని తరగతుల రైతులు నష్టపోయారు.

 

 

➡️