జిల్లాను ప్రగతిపథంలో నడిపేందుకు కృషి

Jun 26,2024 23:01

బాధ్యతలు స్వీకరిస్తున్న కలెక్టర్‌ నాగలక్ష్మి
ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి :
ప్రభుత్వ ప్రాధాన్యతా కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తూ ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారంతో జిల్లాను ప్రగతిపథంలో నడిపించేందుకు కృషి చేస్తానని జిల్లా కలెక్టర్‌ ఎస్‌.నాగలక్ష్మి చెప్పారు. కలెక్టరేట్‌లోని కలెక్టర్‌ ఛాంబర్‌లో బుధవారం ఆమె బాధ్యతలు చేపట్టారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ జిల్లా కలెక్టర్‌గా పనిచేసేందుకు అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వానికి, సిఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. గతంలో నగరపాలక సంస్థ కమిషనర్‌గా పనిచేసిన జిల్లాకు తిరిగి కలెక్టర్‌గా రావటం చాలా ఆనందంగా ఉందన్నారు. రాజధాని పరిధిలో జిల్లాలో పనిచేయటం చాలా గర్వంగా ఉందని, బాధ్యతగా పని చేస్తామని అన్నారు. జిల్లా ప్రజల సమస్యల పరిష్కారానికి నిత్యం అందుబాటులో ఉంటామని చెప్పారు. నూతన కలెక్టర్‌కు జిల్లా ఎస్‌పి తుషార్‌ దూడీ, సంయుక్త కలెక్టర్‌ జి.రాజకుమారి, నగర కమిషనర్‌ చేకూరి కీర్తీ, తెనాలి సబ్‌ కలెక్టర్‌ ప్రఖార్‌జైన్‌, జిల్లా రెవెన్యూ డివిజన్‌ అధికారి పి.రోజా, జిల్లా అధికారులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా జడ్జిని కలిసిన కలెక్టర్‌ జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఎస్‌.నాగలక్ష్మి బుధవారం సాయంత్రం జిల్లా కోర్టు ఆవరణలోని జిల్లా జడ్జి ఛాంబర్‌లో జిల్లా ప్రధాన న్యాయమూర్తి వైవిఎస్‌బిజి పార్థసారథిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఇదిలా ఉండగా కలెక్టర్‌ను ఆమె ఛాంబర్‌లో ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

➡️