మలేరియా రహిత జిల్లాగా మార్చేందుకు కృషి

Apr 25,2024 21:11

ప్రజాశక్తి పార్వతీపురంరూరల్‌ : మలేరియా నివారణకు అందరి సమన్వయంతో సమిష్టి కృషి చేయాలని, సమానత్వ సాధనకు మలేరియా వ్యతిరేక పోరాటాన్ని ఉధృతం చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ బి.జగన్నాథరావు పిలుపునిచ్చారు. ప్రపంచ మలేరియా దినోత్సవం కార్యక్రమం స్థానిక జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయ ప్రాంగణంలో గురువారం నిర్వహించి, పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మలేరియా నియంత్రణకు దోమల వ్యాప్తిని అరికట్టడం ప్రధానమని, అందుకు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, ఇంటి పరిసరాల్లో నీరు నిల్వలేకుండా చూసుకోవాలని, తద్వారా దోమలు వృద్ధి చెందకుండా ఉంటాయన్నారు. మలేరియా ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక శ్రద్ధ చూపాలని సిబ్బందికి సూచించారు. జిల్లా మలేరియా అధికారి (డిఎంఒ) డాక్టర్‌ టి.జగన్‌మోహనరావు మాట్లాడుతూ క్షేత్ర స్థాయిలో ఎప్పటికప్పుడు ఫీవర్‌ సర్వే చేపట్టి జ్వర లక్షణాలున్న వారిని గుర్తించాలని, అన్ని ఆరోగ్య కేంద్రాల పరిధిలో మలేరియా నిర్ధారణ పరీక్షలు అందుబాటులో ఉన్నాయని అన్నారు. కార్యక్రమంలో ఎఎంఒ సూర్యనారాయణ, కన్సల్టెంట్‌ రామచంద్రుడు, ఆఫ్తాల్మిక్‌ ఆఫీసర్‌ నగేష్‌రెడ్డి, డెమోలు యోగీశ్వరరెడ్డి, సన్యాసి రావు, వైద్యారోగ్యశాఖ సిబ్బంది పాల్గొన్నారు.

➡️