చేసిన పనులకు బిల్లులు చెల్లించాలి

డిపిఒ శ్రీనివాస విశ్వనాధ్‌

ఏలూరు సిటీ: గుత్తేదారులు చేసిన పనులకు బిల్లులు చెల్లించాలని పంచాయతీ కార్యదర్శలకు, సర్పంచులకు జిల్లా గ్రామ పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస విశ్వనాధ్‌ ఆదేశాలు జారిచేశారు. అలాగే గ్రామ పంచాయతీలో పేరుకుపోయిన కరెంట్‌ బకాయిలను కూడా చెల్లించాలని అన్నారు. జిల్లాలో 2022-2023 ఆర్థిక సంవత్సరానికి 15వ ఆర్థిక సంఘం నిధులు రెండు విడుతలుగా 545 గ్రామ పంచాయతీలకు రూ.31 కోట్ల 65 లక్షలు జమ కాగా, 2023-2024 ఆర్థిక సంవత్సరానికి మొదటి విడతగా రూ.32 కోట్లు జమా అయ్యాయని అన్నారు. అయితే జమాకాబడిన నిధులలో కేవలం రూ.32 కోట్లు మాత్రమే ఖర్చు చేసారని, ఇంకా 31 కోట్లు పైబడి ఖర్చు చేయాల్సి ఉందని డిపిఒ తెలిపారు. పంచాయతీ పరిధిలో పనులు చేసిన గుత్తేదారులకు బిల్లులు రావట్లేదని ఫిర్యాదులు అందడంతో తక్షణమే కాంట్రాక్టర్లు నిబంధనల మేరకు బకాయిలు చెల్లించాలని ఆదేశాలు జారీచేశారు. త్వరలో 2023-2024 ఆర్థిక సంఘం నిధులు రెండవ విడుత విడుదల కానున్నాయని డిపిఒ తెలియజేశారు.

➡️