సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమం తీవ్రతరం

Dec 15,2023 23:38

ఆశావర్కర్స్‌ యూనియన్‌ (సిఐటియు) రాష్ట్ర అధ్యక్షులు కె.పోశమ్మ
ప్రజాశక్తి – ఏలూరు అర్బన్‌
ఆశావర్కర్ల సమస్యల పరిష్కారానికి రెండు రోజులుగా కలెక్టరేట్‌ వద్ద ఆందోళన చేస్తున్నా అధికారులు స్పందించకపోవడంతో శుక్రవారం పెద్దఎత్తున ఆందోళన నిర్వహించారు. కలెక్టరేట్‌ను ముట్టడించడానికి వందలాదిమంది ఆశాలు ప్రదర్శనగా కలెక్టర్‌ కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. కలెక్టరేట్‌ బారికేడ్‌ వద్ద బైఠాయించి అధికారులు తమ వద్దకు రాకపోతే కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశావర్కర్స్‌ యూనియన్‌ (సిఐటియు) రాష్ట్ర అధ్యక్షులు కె.పోశమ్మ మాట్లాడుతూ కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి పనిచేసిన ఆశావర్కర్లను సిఎం జగన్‌ చిన్నచూపు చూస్తున్నారన్నారు. సమస్యల పరిష్కారానికి రాష్ట్రవ్యాప్తంగా పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పారు. ఆశావర్కర్లు రెండు రోజులుగా ధర్నా నిర్వహిస్తూ అర్ధరాత్రి పూట జిల్లా కలెక్టరేట్‌ వద్ద నడిరోడ్డుపై నిద్రిస్తే జిల్లా అధికారులెరూ పట్టించుకోలేదన్నారు. ఆశా వర్కర్లకు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలన్నారు. విధి నిర్వహణలో చనిపోయిన ఆశావర్కర్లకు రూ.10 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. ఆశావర్కర్ల జాబ్‌తో సంబంధం లేని పనులు చెబితే తిరస్కరిస్తామన్నారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్‌.లింగరాజు, ప్రధాన కార్యదర్శి డిఎన్‌విడి.ప్రసాద్‌ మాట్లాడుతూ తక్షణమే పని భారం తగ్గించాలని డిమాండ్‌ చేశారు. ఆశావర్కర్స్‌ యూనియన్‌ జిల్లా నాయకులు కమల, రోజా, లోకేశ్వరి, కామేశ్వరి, కనకదుర్గ, మేరీ, పావని, పరమేశ్వరి, లలిత, అరుణ, విజయ, నాగ దుర్గ, పావని, నాగమణి నాయకత్వం వహించారు. సిఐటియు నగర అధ్యక్ష, కార్యదర్శులు బి.జగన్నాథం, వి.సాయిబాబు, ఆటో యూనియన్‌ జిల్లా కార్యదర్శి జె.గోపీ పాల్గొని మద్దతు తెలిపారు. ఆశాల వద్దకు వచ్చిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి నాగేశ్వరరావుకు వినతిపత్రం అందించారు. సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.

➡️