నాగార్జునతో రాయబారం

Apr 27,2024 22:11

 ప్రజాశక్తి – విజయనగర ప్రతినిధి/కోట : చేతుల కాలాక ఆకులు పట్టుకోవడం అంటే బహుశా ఇదేనేమో. నామినేషన్‌ వేసేవరకు మీసాల గీత మాజీ ఎంఎల్‌ఎ అని, అంతకుముందు మున్సిపల్‌ ఛైర్మన్‌ గా పని చేశారని, ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేసినా నియోజకవర్గంలో ఎంతోకొంత ప్రభావం చూపుతారని ముందుగా గుర్తుకు రాలేదేమో టిడిపి నాయకులకు. నామినేషన్‌ వేసిన నాలుగు రోజుల తరువాత నుంచి గీత కోసం గిర గిరా తిరుగుతున్నారు. తాజాగా టిడిపి జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున శనివారం గీత ఇంటికి రాయవారానికి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యులు పూసపాటి అశోక్‌ గజపతి రాజు వైఖరితో చంద్రబాబు వ్యూహం బెడిసి కొట్టినట్లు ఈనెల 27 ప్రజాశక్తి లో రాజకీయ కథనం వెలువడిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో పార్టీ అధిష్టానం జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జునను గీత ఇంటికి పంపినట్టు సమాచారం. నామినేషన్‌ ఉపసంహరించు కోవాలంటూ అశోక్‌ విజ్ఞప్తి చేస్తున్నారని, తన మాటకూడా అదేనని గీతకు నాగార్జున చెప్పారట. ఈ ప్రతిపాదనను గీత సున్నితంగా తిరస్కరించినట్లు తెలిసింది. ‘నాకు చీపురుపల్లి టిక్కెట్‌ ఇస్తామని ఆరు నెలల క్రితమే అధిష్టానం చెప్పింది. చివరిదశ చీపురుపల్లి అసెంబ్లీ లేదా విజయనగరం ఎంపి టిక్కెట్‌ లలో ఏదో ఒకటి తప్పకుండా ఇస్తామని చెప్పారు. అందుకు అవసరమైన ఏర్పాట్లు కూడా చేసుకుని సిద్ధంగా ఉండాలని కూడా అధినేతలిద్దరూ హామీ ఇచ్చారు. తీరా జాబితా లో నా పేరు రెండు చోట్లా కనిపించలేదు. ఈ విషయమై నేను ఫీల్‌ కాలేదు’ అని నాగార్జున చెప్పినట్లు తెలిసింది. అధినేత నిర్ణయాన్ని గౌరవించి, పార్టీకి సహకరించాలని కోరారు .దీనికి గీత బదులిస్తూ మొన్నటివరకు తనను పట్టించుకోలేదని, స్థానికంగా చేస్తున్న కార్యక్రమాల విషయం లో కూడా ఎలాంటి సమాచారం అందడం లేదని, తనను నమ్ముకున్న నాయకులు, కార్యకర్త అభీష్టం మేరకు నామినేషన్‌ వేశానని, ఉపసంహరించుకోబోనని చెప్పినట్లు తెలిసింది. అధిష్టానం మాట తప్పి నంత సులువుగా నేను ఇచ్చిన మాట తప్పలేను అంటూ ఖరా ఖండిగా చెప్పినట్లు తెలిసింది. తాను ఆత్మ గౌరవానికే నిలబబడతానని అన్నట్లు తెలిసింది. చిత్తశుద్ధి ఉంటే అశోక్‌ లేదా ఆయన కూతురు, ప్రస్తుత అభ్యర్థి గీత తో మాట్లాడే వారని, గీతపై పార్టీలో నిందలు వేసేందుకే తండ్రీ కూతురు కలిసి నాగార్జునతో రాయబారం నడిపారని గీతా అనుచరులు అంటున్నారు. అంతకు ముందు చంద్రబాబు సూచనమేరకు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు పిలుపును కూడా గీత తిరస్కరించిన సంగతి తెలిసిందే. ఈ నెల 29తో నామినేషన్‌ ఉపసంహరణ ప్రక్రియ ముగుస్తుంది. ఈలోపు అధిష్టానం గీతను ఒప్పించడానికి ప్రయత్నం చేస్తుందా? అసలు గీత మెత్తబడతారా? తగ్గేదే లేదంటూ ముందుకు సాగుతారా? మరో ఈ రెండు రోజుల్లో తేలనుంది.

➡️