పోస్టల్‌ బ్యాలెట్‌కు పోటెత్తిన ఉద్యోగులు

May 5,2024 21:55

జిల్లా వ్యాప్తంగా ఆదివారం పోస్టల్‌ బ్యాలెట్‌ పోలింగ్‌ ఉత్సాహంగా ప్రారంభమైంది. ఓటు వేసేందుకు ఉద్యోగులంతా ఉదయం 8.30గంటలకే కేంద్రాల వద్దకు చేరుకున్నారు. విజయనగరం జిల్లా వ్యాప్తంగా ఏడు నియోజకవర్గాల్లో 18631 మంది పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం దరఖాస్తు చేసుకోగా, తొలిరోజు 4989 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరేకాక ఇతర జిల్లాలకు చెందిన 670 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో నాలుగు నియోజకవర్గాల్లో 6,812 ఓట్లకు గాను 3,310 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు

.ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌: విజయనగరం నియోజకవర్గానికి సంబంధించి జెఎన్‌టియులో ఐదు పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయగా, ఒకటి రెండు కేంద్రాల్లో పోలింగ్‌ అరగంట ఆలస్యంగా ప్రారంభమైంది. నియోజక వర్గ ఫెసిలిటేషన్‌ సెంటర్‌ను, రిటర్నింగ్‌ అధికారి, జాయింట్‌ కలెక్టర్‌ కె.కార్తీక్‌ పర్యవేక్షించారు. కొంతమంది ఉద్యోగులకు ఓటు లేకపోవడంతో వారంతా ఆందోళన చెందారు. జెసి కార్తీక్‌ వెంటనే స్పందించి ఓటరు జాబితాలో పేరు లేనప్పటికీ, ఎన్నికల డ్యూటీ ఆర్డరు ఉంటే వెనువెంటనే ఫారం -12 అక్కడికక్కడే నింపించి ఓటు హక్కు కల్పించారు. దీంతో ఉద్యోగులు ఊపిరి పీల్చుకు న్నారు. హెల్ప్‌ డెస్క్‌ల్లో ఓటర్లకు అందుతున్న సహాయాన్ని, ఓటింగ్‌ జరుగుతున్న కేంద్రాలను జెసి కార్తీక్‌ పరిశీలించారు. ఓటింగ్‌కు వచ్చే ఉద్యోగులకు టిఫిన్లు, కూర్చునేందుకు టెంట్లు ఏర్పాటు చేశారు. జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించారు. జెఎన్‌టియులో ఏర్పాటు చేసిన రెండు ఫెసిలిటేషన్‌ కేంద్రాలను సందర్శించారు. ఓటింగ్‌ ప్రక్రియను పోస్టల్‌ బ్యాలెట్‌కు పోటెత్తిన ఉద్యోగిపరిశీలించారు. ఎన్నికల ఏర్పాట్లపై ఉద్యోగులను ఆరా తీశారు. పలు సూచనలు చేశారు. క్యూలైన్లలో ఎక్కువ సేపు వేచి ఉండకుండా, ప్రక్రియను వేగంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అవసరమైన వారికి హెల్ప్‌ డెస్కుల్లో పూర్తి సమాచారాన్ని అందించాలని చెప్పారు. కొంతమంది తమ ఓటు జాబితాలో లేదని చెప్పడంతో, వారికి ఓటు వేసే అవకాశాన్ని కల్పిస్తామని కలెక్టర్‌ చెప్పారు. డ్యూటీ నియామక పత్రాలు, గుర్తింపు కార్డులను తీసుకువెళ్లి సంబంధిత నియోజకవర్గంలో ఓటు వేయవచ్చునని సూచించారు. ఇతర జిల్లాలకు చెంది ఉండి ఈ జిల్లాలో ఉద్యోగం చేస్తున్న వారు ఓటు వేసేందుకు వీలుగా జెఎన్‌టియు బ్లాక్‌ 1లో ఏర్పాట్లు చేశారు. ఫెసిలిటేషన్‌ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించారు. ఉద్యోగులు ఎక్కడా ఇబ్బంది పడకుండా హెల్ప్‌ డెస్కులను ఏర్పాటు చేసి, ఓటర్‌ స్లిప్పులు, అవసరమైన ఇతర సహాయ సహకారాలను అందించారు. అసిస్టెంట్‌ కలెక్టర్‌ వెంకట త్రివినాగ్‌తోపాటు పోస్టల్‌ బ్యాలెట్‌ జిల్లా నోడల్‌ అధికారి కె.సందీప్‌ కుమార్‌, డిఆర్‌డిఎ పీడీ ఎ.కల్యాణ చక్రవర్తి, ఎస్‌సి కార్పొరేషన్‌ ఇడి సుధారాణి, జెడ్‌పి డిప్యుటీ సిఇఓ కె.రాజ్‌కుమార్‌, ఇతర అధికారులు ఓటింగ్‌ ప్రక్రియను, ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఓటింగ్‌ జరుగుతున్న ప్రాంతానికి వైసిపి ఎంపి అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్‌ వచ్చి పరిశీలించారు. పోలింగ్‌ కేంద్రాల బయట ఉద్యోగులను కలిసి ఓటుకోసం అభ్యర్థించారు. విజయనగరం అసెంబ్లీ పరిధిలో మొత్తం 3,975 మంది ఓటర్లకు గాను 1356 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. శృంగవరపుకోట : నియోజకవర్గ కేంద్రంలోజరిగిన పోస్టల్‌ బ్యాలెట్‌ పోలింగ్‌లో 1757ఓట్లకు గాను 563 ఓట్లు పోలయ్యాయి. ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి పి.మురళీకృష్ణ పరిశీలించారు. ఈనెల 8 వరకు పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుందని ఎన్నికల అధికారి తెలిపారు.గజపతినగరం : నియోజకవర్గ కేంద్రంలో పోస్టల్‌ బ్యాలెట్‌ ప్రక్రియ ప్రశాంతంగా జరిగింది. మొత్తం 1824ఓట్లకు గాను 603ఓట్లు పోలయ్యాయి. పోలింగ్‌ ప్రక్రియను రిటర్నింగ్‌ అధికారి సూర్యకళ పరిశీలించారు. పోలింగ్‌ ఆఫీసర్లు విధుల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.బొబ్బిలి : గొల్లపల్లి శ్రీవేణుగోపాల మున్సిపల్‌ పాఠశాలలో ఉదయం 9 గంటలకు పోలింగ్‌ ప్రారంభమైంది. నియోజకవర్గంలో 2096మంది పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటర్లు ఉండగా 749మంది మొదటిరోజు ఓటుహక్కును వినియోగించుకున్నారు. పోలింగ్‌ ప్రక్రియను ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి సాయిశ్రీ పర్యవేక్షించారు. గుమిగూడిన రాజకీయ పార్టీల నాయకులు పోస్టల్‌ బ్యాలెట్‌ పోలింగ్‌ కేంద్రం వద్ద వైసిపి, టిడిపి నాయకులు, కార్యకర్తలు గుమిగూడారు. పోలింగ్‌ కేంద్రాన్ని ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు, టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి బేబినాయన సందర్శించారు. ఈ కేంద్రానికి సమీపంలో రాజకీయ పార్టీల నేతలు ఉండడంతో వారిని దూరంగా పంపించాలని పట్టణ సిఐ ఎం.నాగేశ్వరరావును ఆర్‌ఒ సాయిశ్రీ ఆదేశించారు. దీంతో రాజకీయ నాయకులను దూరంగా పంపించే ప్రయత్నం చేస్తున్న క్రమంలో సిఐ నాగేశ్వరరావు, వైసిపి నాయకుల మధ్య వాగ్వివాదం జరిగింది.నెల్లిమర్లలో నియోజక వర్గంలో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు 587 వినియోగం నెల్లిమర్ల : నియోజక వర్గంలో 1527 మందిఓటర్లకు గాను 587 మంది పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటు వినియోగించుకున్నారు. స్థానిక సికెఎం ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో పోస్టల్‌ బ్యాలెట్‌ పోలింగ్‌ కేంద్రం ఏర్పాటు చేశారు. ఐదు పోలింగ్‌ కేంద్రాలలో నిర్వహించిన పోలింగ్‌ లో 587 మంది పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటును వినియోగించుకున్నారు. వీరిలో 128 మంది మహిళలు, 453 పురుషులు ఉన్నారు. రిటర్నింగ్‌ అధికారి ఎం.నూక రాజు, ఎఆర్‌ఒ డి. ధర్మ రాజు పోలింగ్‌ను పరిశీలించారు.

➡️