ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి

May 8,2024 21:21

ప్రజాశక్తి-విజయనగరం కోట :  ఎన్నికల్లో ప్రతీ ఒక్కరూ ఓటు వేసి, జిల్లాలో ఓటింగ్‌ శాతాన్ని పెంచాలని జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు తలాత్‌ పర్వేజ్‌ ఇక్బాల్‌ రోహెల్లా పిలుపునిచ్చారు. స్వీప్‌ కార్యక్రమంలో భాగంగా బుధవారం నగరంలో భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించి, ఓటుహక్కు వినియోగంపై అవగాహన కల్పించారు. ర్యాలీని కలెక్టరేట్‌ వద్ద పరిశీలకులు తలాత్‌ పర్వేజ్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ వెంకట త్రివినాగ్‌ ప్రారంభించారు. స్వయంగా మోటార్‌ సైకిల్‌ నడిపి ర్యాలీలో పాల్గొన్నారు. ఈర్యాలీ ఆర్‌అండ్‌బి జంక్షన్‌, మయూరి, ఆర్‌టిసి కాంప్లెక్స్‌, అంబేద్కర్‌ జంక్షన్‌, కోట, మూడు లాంతర్లు, గంటస్తంభం మీదుగా రాజీవ్‌ క్రీడా మైదానం వరకు సాగింది. ఇక్కడ మానవహారాన్ని నిర్వహించి, ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా పరిశీలకులు తలాత్‌ పర్వేజ్‌ మాట్లాడుతూ, . ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో జరుగుతున్న ఈ ఎన్నికలు, ప్రజాస్వామ్య మనుగడకు మూలాధారమని పేర్కొన్నారు. ఓటుహక్కును వినియోగించుకోవడం ద్వారా ఈమహాక్రతువులో ప్రతీఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. జిల్లాలో ఓటింగ్‌ శాతాన్ని పెంచేందుకు వివిధ రూపాల్లో అవగాహనా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని తెలిపారు. అసిస్టెంట్‌ కలెక్టర్‌ వెంకట త్రివినాగ్‌ మాట్లాడుతూ, ప్రతీఒక్కరూ నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. శతశాతం ఓటింగ్‌ నమోదు చేసే దిశగా జిల్లా యంత్రాంగం స్వీప్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని చెప్పారు. దీనిలో భాగంగా పౌరులకు ఓటు వినియోగంపై పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తున్నామన్నారు. మహిళలు, యువ ఓటర్లంతా ముందుకు వచ్చి ఓటు వేయాలని కోరారు. కార్యక్రమంలో స్వీప్‌ నోడల్‌ అధికారి, హౌసింగ్‌ పీడీ శ్రీనివాసరావు, సిపిఒ పి.బాలాజీ, జిల్లా సైనిక సంక్షేమాధికారి డాక్టర్‌ సత్యప్రసాద్‌, ఎపిఎంఐపి పీడీ లక్ష్మీనారాయణ, మున్సిపల్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ తిరుమలరావు, డిఎస్‌డిఒ వెంకటేశ్వర్రావు, లైజనింగ్‌ ఆఫీసర్‌ దుర్గాప్రసాద్‌, రీసోర్స్‌ పర్సన్‌ పద్మనాభం, మెప్మా అధికారులు, సిబ్బంది, పొదుపు సంఘాల సభ్యులు, హౌసింగ్‌ సిబ్బంది పాల్గొన్నారు.

➡️