వలస ఓటర్లకు గాలం

May 9,2024 21:26

 ఫోన్‌ పే ద్వారా రాకపోకలకు ఛార్జీలు

ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్న పార్టీలు

ప్రజాశక్తి – విజయనగరం టౌన్‌ : ‘అన్నా.. బాగున్నారా.. ఈ నెల 13వ తేదీన ఎలక్షన్లు ఉన్నాయి… గుర్తుంది కదా..? తప్పకుండా అందరూ రావాలి.. వదినను కూడా తీసుకుని రండి. అందరూ మనపార్టీకే ఓటు వేయాలి. మనోళ్లను గెలిపించుకోవాలి. ఎంత పని ఉన్నా కొంచెం పక్కన పెట్టుకుని ముందే రావాలి. ప్రయాణ ఖర్చులు మేమే భరిస్తాం. ఇంతకీ.. నీది ఫోన్‌ పేనా..? గూగుల్‌ పేనా..? అన్న..’ అంటూ జిల్లాలోని అన్ని నియోజవకవర్గాల్లోనూ వైసిపి, టిడిపి అభ్యర్థులు ఓటర్లకు గాలం వేస్తున్నారు. సాధారణ ఎన్నికల్లో అభ్యర్థుల మధ్య హోరాహోరీ పోరు జరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఓటూ కీలకంగా మారుతోంది. ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చిన వెంటనే అభ్యర్థులు ఓటర్ల జాబితాలో పేర్లను జల్లెడ పట్టారు. ఇక్కడి నుంచి ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిన ఓటర్లు ఏ ఊర్లో ఉన్నారో ఆరా తీశారు. వారి ఫోన్‌ నెంబర్లు సేకరించి వారి వద్ద ఉంచుకున్నారు.పోలింగ్‌ సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో వారందరికీ ఫోన్లు చేసి తమకే ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. విశాఖలో ఉంటున్న వారితో గజపతినగరం, విజయనగరం, ఎస్‌.కోట అభ్యర్థులు ఆత్మీయ సమావేశాలు కూడా నిర్వహించారు. ఏనాడూ పలకరించని వీరు ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు రెండు పూటలా వారికి ఫోన్లు చేసి పలుకరిస్తున్నారు. రవాణా సౌకర్యం కల్పిస్తున్న నేతలుసుదూర ప్రాంతాల్లో ఉంటున్న ఓటర్లను రప్పించేందుకు కొంతమంది అభ్యర్థులు రవాణా సౌకర్యం ఏర్పాటు చేస్తున్నారు. విశాఖ, విజయవాడలో ఉంటున్న వారికి ప్రైవేటు బస్సులు, కార్లు ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్‌, తిరుపతి, కోల్‌కత్తా, చెన్నై ప్రాంతాల్లో ఉన్న వారికి రైల్వే ఛార్జీలను ముందుగానే ఫోన్‌పే ద్వారా పంపుతున్నారు. బయట ప్రాంతంలో ఓటర్లను గుర్తించి అనుచరులు ద్వారా రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.ఓటరు లిస్టును జల్లెడ పడుతున్న నేతలువిజయనగరం నియోజకవర్గంలో నేతలు విస్తృత ప్రచారాలు చేపడుతూనే బయట ప్రాంతాల్లో ఉంటున్న వారి వివరాలను జల్లెడ పట్టి ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసి వారిని రప్పించేందుకు చర్యలు చేపడుతున్నారు. విజయనగరం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన అనేక కుటుంబాలు ఇతర ప్రాంతాల్లో ఉన్నాయి. నియోజకవర్గంలో 2,52,000 పైగా ఓటర్లు ఉన్నారు. వీరిలో సుమారు 5 వేలు నుంచి 10 వేలు వరకు విద్య, ఉద్యోగం ఉపాధి వ్యాపారం నిమిత్తం వివిధ ప్రాంతాల్లో ఉంటున్నారు. వారి ఓట్ల కోసం నాయకుల గురి పెట్టినట్లు తెలుస్తోంది. గెలుపే లక్ష్యంగా ఉన్న ఏ అవకాశాన్ని వదులు కోవడం లేదు.గజపతినగరం : నియోజకవర్గంలో 2లక్షల 5041 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో సుమారు 30వేల మంది వలస ఓటర్లు ఉన్నారు. టిడిపి, వైసిపి అభ్యర్థులు వారితో సమావేశాలు నిర్వహించి వారిని రప్పించేందుకు ఏర్పాట్లు చేశారు. రవాణా ఖర్చులు కూడా ఇచ్చినట్లు తెలిసింది. వలస ఓటర్లపైనే దృష్టిరేగిడి: రాజాం నియోజకవర్గంలో రేగిడి, వంగర, సంతకవిటి, రాజాం మండలాల్లో 120 గ్రామ పంచాయతీలున్నాయి. టిడిపి, వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థులు వలస ఓటర్లపై దృష్టి పెట్టారు. నియోజకవర్గంలో 2,24,503 ఓటర్లుగా ఉన్నారు. వీరిలో 85 వేలకు పైగా వలస ఓటర్లు ఉన్నారని అంచనా వేస్తున్నారు. గ్రామాల్లో ఎంతమంది ఓటర్లు వలస కూలీలుగా ఉన్నారో గ్రామస్థాయి నాయకులతో చర్చలు జరిపి వారిని మే 13 నాటికి రప్పించేందుకు ప్రణాళికలు రూపొందించారు. గ్రామస్థాయిలో వలస కూలీలు ఎక్కడ ఎంతమంది ఉన్నారో కాగితాలపై రాయించుకుని వారి ఫోన్‌ నెంబర్లను సేకరిస్తున్నారు. వారు స్వగ్రామాలకు వచ్చేందుకు బస్సు, రైలు, ఇతర వాహనాల ఛార్జీలకు గ్రామస్థాయి నాయకులతో ఫోన్‌ పే ద్వారా నగదు పంపిణీ చేస్తున్నారు. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం వంటి దగ్గర ప్రాంతాల్లో ఉంటున్న వలస ఓటర్ల వద్దకు నేరుగా గ్రామ స్థాయి నాయకులే వెళ్లి వారితో మాట్లాడి నగదు పంపిణీ చేసి వస్తున్నారు. ఇటు వైసిపి, అటు టిడిపి కూటమి అభ్యర్థులు వలస ఓటర్లపైనే దృష్టి పెట్టి ఎత్తుకు పై ఎత్తు వేసి వారిని రప్పించి తమ మెజార్టీని నిరూపించుకునేందుకు తంటాలు పడుతున్నారు. వీరికి తోడు గ్రామాల్లో మైనారిటీ, కూలీల ఓటర్లకు నగదు ఇచ్చి ప్రసన్నం చేస్తున్నారు. ముఖ్యంగా నియోజకవర్గంలో వలస కూలీలే గెలుపునకు కీలకంగా మారడంతో వైసిపి, టిడిపి నేతలు మల్లా గుల్లాలు పడుతున్నారు.

➡️