సాహితీ రంగానికి ఆహ్వానలక్ష్మి సేవలు వెలకట్టలేనివి

 నారాయణను సత్కరిస్తున్న శివశంకర్‌, వీరలక్ష్మిదేవి తదితరులు

 తెనాలి: ప్రముఖ సాహితీవేత్త ఆహ్వానలక్ష్మి సాహితీ రంగానికి చేసిన సేవలు వెలకట్టలేనివని కేంద్ర సాహిత్య అకాడమి పురస్కార గ్రహీత పాపినేని శివశంకర్‌ అన్నారు. ఆహ్వానలక్ష్మి ప్రథమ వర్ధంతి సభ శనివారం స్థానిక కవిరాజాపార్కు సీనియర్‌ సిటిజన్స్‌ భవన్‌లో పట్టణానికి చెందిన భిన్న స్వరాలు సాహితీ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించారు. సంస్థ అధ్యక్షులు జిఎస్‌ నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సభలో ముఖ్యఅతిధిగా పాల్గొన్న శివశంకర్‌ మాట్లాడుతూ ఎన్నో ఆర్ధిక ఒడిదుడుకులను ఎదుర్కొని పుట్టింటి వారు ఇచ్చిన ఆస్తిని అమ్మి ఆహ్వానం పత్రికను విలువలతో నడిపించిన ఘనత లక్ష్మికే దక్కుతుందన్నారు. ప్రముఖ కధా రచయిత్రి వాడ్రేవు వీరలక్ష్మిదేవి మాట్లాడుతూ ఆహ్వాన లక్ష్మి నాలుగేళ్ళపాటు సాహితీ మాసపత్రిక ఆహ్వానంను నడిపి, తన ఇంటిపేరు ఎఎస్‌ లక్ష్మికి బదులుగా ఆహ్వానం లక్ష్మిగా ప్రాచుర్యం పొందారని కొనియాడారు. ఆహ్వానం పత్రికలో అద్భుతమైన సంపాదకీయాలు రాయ టంతో పాటు సాహితీవేత్తల పట్ల తనకున్న అభిమానానికి గుర్తుగా తన కుమారునికి ప్రముఖ కవి, చిత్రకారుడు సంజీవ్‌దేవ్‌ పేరు పెట్టారని ప్రశంసించారు. సభలో కథారచయిత కాట్రగడ్డ దయానంద్‌, కవితా సంపాదకులు బండ్ల మాధవరావు, ఆహ్వాన లక్ష్మి కుమారుడు సమయం రాజా సంజీవ్‌దేవ్‌ ప్రసంగించారు. కార్యక్రమంలో సీనియర్‌ పాత్రికేయులు బిఎల్‌ నారా యణను సత్కరించారు. ఎం.విజయ భాస్కర్‌, ఎం.సత్యనారాయణ, బెన్షర్‌బాబు పాల్గొన్నారు.

➡️