ఆశాలపై జగన్ ప్రభుత్వ నిర్బంధం

Feb 8,2024 16:08 #aasha workers, #Dharna, #Kakinada
  • 24గంటల్లో 4సార్లు ఆశాలను అరెస్టు చేసిన పోలీసులు
  • విజయవాడ వెళ్లేందుకు ఆశాల తీవ్ర ప్రయత్నం

ప్రజాశక్తి కాకినాడ : ఏపీ ఆశ వర్కర్స్ యూనియన్ సిఐటియు పిలుపుమేరకు విజయవాడ బయలుదేరిన ఆశలను పోలీసులు ద్వారా జగన్ ప్రభుత్వం అరెస్టులు చేయించింది. నిర్బంధానికి వ్యతిరేకంగా ఆశలు తీవ్రంగా ప్రతిఘటించారు. ఆశా వర్కర్లకు కనీస వేతనం 26,000 చెల్లించాలని, యాప్స్ పేరుతో చేయించుకుంటున్న పని భారాన్ని తగ్గించాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ ఆశా కార్యకర్తలకు అమలు చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని, పిఎఫ్, ఈఎస్ఐ అమలు చేయాలని డిమాండ్లపై గురువారం తలపెట్టిన చలో విజయవాడ ధర్నా కార్యక్రమం ఉద్రిక్తలకు దారితీసింది. బుధవారం తెల్లవారుజాము నుండే సచివాలయ పోలీసులు ద్వారా ఆశల ఇళ్లకు వెళ్లి ఆటోలు ద్వారా స్టేషన్లకు తరలించారు. రైల్వే స్టేషన్లలో, బస్ స్టేషన్లలో సొంత వాహనాలు పెట్టుకుని వెళ్తున్న ఆశలను సైతం నిర్బంధించారు. ఉదయం ఏడు గంటలకు అరెస్టు చేసి రాత్రి 10 గంటల వరకు కళ్యాణ మండపాల్లో, పోలీస్ స్టేషన్లో విజయవాడ వెళ్లే ట్రైన్స్ అన్ని వెళ్లిపోయేదాకా నిర్బంధించారు. అర్ధరాత్రి టికెట్టు కొనుక్కుని ఆర్టీసీ బస్సులు ఎక్కిన ఆశాలను సైతం ప్రయాణ మార్గాలలో రామచంద్రాపురం, ఏలూరు, వడ్డేశ్వరం వద్ద బలవంతంగా బస్సుల నుండి దింపి స్థానిక స్టేషన్లకు తరలించారు. జిల్లాలో సామర్లకోట, పెద్దాపురం, తుని, పిఠాపురం, కాకినాడ వన్ టౌన్, 3 టౌన్ తాళ్ళరేవు పోలీస్ స్టేషన్లు, జిల్లా పరిషత్తు కళ్యాణమండపాలు ఆశాలతో కిక్కిరిపోయాయి. ప్రభుత్వ నిర్బంధాన్ని ప్రశ్నిస్తూ ఆశా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కాకినాడ సుందరయ్య భవన్ నుండి కలెక్టరేట్ కు వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు తాళ్లను, వాహనాలను అడ్డుపెట్టి ఆటంకపరిచే ప్రయత్నంలో పోలీసులకు ఆశాలకు మధ్య తీవ్ర తోపులాటలు జరిగాయి. ఆందోళనకు నాయకత్వం వహిస్తున్న సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వ శేషబాబ్జిని, ఆశ వర్కర్స్ యూనియన్ జిల్లా కోశాధికారి నొక్క లలిత, నాయకులు మలకా నాగలక్ష్మి, చెక్కల వేణిలను అరెస్టుచేసి స్థానిక 3టౌన్, 1టౌన్ లకు తరలించారు. అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని కోరుతూ కాకినాడ ఆర్ డి ఓ ఆఫీస్ ముందు సుమారు 200 మంది ఆశా కార్యకర్తలు ధర్నా నిర్వహించడంతో పోలీసులు అరెస్టు చేసిన నాయకత్వాన్ని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు టి. రాజా, రొంగల ఈశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజకుమార్, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️