విద్యా ధనం!

Jun 30,2024 10:10 #chirumuvallu, #Sneha

రామప్ప, కృష్ణప్ప మంచి స్నేహితులు. ఇద్దరూ ఒకే ఊరిలో పక్కపక్కనే నివసిస్తున్నారు. ఇద్దరూ ఐదో తరగతి వరకు చదువుకున్నారు. రామప్ప రాళ్లు కొట్టి జీవనం సాగిస్తున్నాడు. కృష్ణప్ప వ్యవసాయం చేసుకుని జీవిస్తున్నాడు.
రామప్ప కడు పేదవాడు. ఇంట్లో తినడానికే తిండి లేక ఆకలితో అలమటించేవాడు. చిన్నప్పుడు తల్లిదండ్రులను కోల్పోయాడు. ఐదో తరగతితో చదువు ఆగిపోయిన తర్వాత రోళ్లు తయారుచేసే వారి వద్ద పనికి చేరాడు. అక్కడే పనిచేస్తున్న ఓ అమ్మాయితో వివాహమైంది. ముగ్గురు ఆడపిల్లలు పుట్టారు. రామప్ప ఆడపిల్లలను తనలా చదువు లేకుండా పెంచకూడదని నిశ్చయించుకున్నాడు.
కృష్ణయ్యకు ఒకే కొడుకు ఉన్నాడు. అతనికి చదువు ఒంటబట్టలేదు. దీనికి తోడు తను బాగా సంపాదించి లక్షాధికారి అయి, ఆ ఊరిలో అందరి వద్దా ప్రశంసలు పొందాలనుకున్నాడు. దీనికి తగినట్లు కృష్ణయ్య కొడుకును వ్యవసాయంలో బాగా ప్రోత్సహించాడు. అది అతనికి బాగా కలిసి వచ్చింది. బాగా పంటలు పండటంతో లాభాలు ఆర్జించాడు. వచ్చిన లాభంతో మరో నాలుగు ఎకరాల పొలం కొన్నాడు. ఆ ఊరిలో కృష్ణయ్య కొడుకు బాగా డబ్బు, పేరు సంపాదించాడు. తన కొడుకు బాగా డబ్బున్న వాడని అందరూ గౌరవిస్తారని చెప్పుకుని గర్వపడేవాడు.
నిరాడంబరంగా వుండే రామప్ప తన ముగ్గురు కూతుళ్లను కష్టపడి, బాగా చదివించాడు. ఉద్యోగాలు రాక వయసు మీద పడుతున్న కూతుళ్లను చూసిన కృష్ణయ్య ‘చదువులు చదివిస్తే ఏం లాభం? డబ్బు లేకుంటే ఈ కాలంలో అబ్బాయిలను ఎవరిస్తారు? అమ్మాయిలకి ఇంత పెద్ద చదువులు అవసరమా?’ అని రామప్పని హేళన చేయసాగాడు.
రామప్ప ఏమాత్రం కుంగిపోలేదు. ‘ఈ రోజుల్లో డబ్బులు వుంటే సరిపోదు. విద్య కూడా వుండాలి. అదే జీవితాంతం ధనం ఇస్తుంది..’ అని హితవు పలికాడు.
ఓ రెండేళ్లు గడిచాయి. కృష్ణప్ప కొడుక్కి మంచి పెళ్లి సంబంధాలు వచ్చినా కట్నం ఎక్కువ ఇవ్వలేదని తిరస్కరించసాగాడు. దీంతో వివాహం కాకుండా మిగిలిపోయాడు.
ఓ రోజు కృష్ణప్ప కొడుకు అవార్డుకు ఎంపికయ్యాడు. మామిడి పంటను బాగా పండించి, మెళకువలు పాటించింనందుకు ప్రభుత్వం నుంచి అవార్డు అందుకోవడానికి పట్టణానికి బయలుదేరాడు. అతని వెనుకే కృష్ణప్ప కూడా వచ్చాడు. సభ మొదలైంది. స్టేజీ మీదికి వచ్చిన కృష్ణప్ప కొడుకు తనకు అవార్డు ఇస్తున్న అధికారిణిని చూసి అవాక్కయ్యాడు. రామప్ప పెద్ద కూతురు రమ్య కలెక్టర్‌ హోదాలో జ్ఞాపికను అందించింది. అది చూసిన కృష్ణప్పకు నోట మాట రాలేదు.
కృష్ణప్ప పశ్చాత్తాపంతో రామప్ప దగ్గరకు వెళ్లి ‘రామప్ప ఆడపిల్లలను చదివించాలన్న నీ కృషి ఫలించింది. నీ కూతురిని కలెక్టర్‌ని చేశావు. డబ్బే గొప్ప అని చెప్పుకునే నాకు జ్ఞానోదయమైంది. నన్ను క్షమించు’ అని కోరతాడు.

బోగా పురుషోత్తం
9701299686

➡️