తాతయ్య

Jun 30,2024 10:09 #chirumuvallu, #kathalu, #Sneha

హరీష్‌ ఆఫీస్‌ నుంచి రాగానే పిల్లలు సుభాష్‌, మనీషలతో ‘ఒరేరు! రేపు ఆదివారం కదా! మనమంతా తాతయ్యని చూసి వద్దాం’ అని చెప్పాడు. ‘భలే..! భలే..! తాతయ్యని చూసి చాలా రోజులైంది. తాతయ్యతో రేపు అంతా గడుపుదాం’ అని ఇద్దరు పిల్లలు కేరింతలు కొట్టారు. ఇంతలో వంటింటి నుంచి తల్లి సుభద్ర ‘ఒరేరు! అక్కడ ఎక్కువ అల్లరి పెట్టకూడదు. తాతయ్యని ఇబ్బంది పెట్టకూడదు’ అని కేకవేసి చెప్పింది. ‘అలాగే అమ్మ..!’ అని ఇద్దరూ ఒకే మాటగా అన్నారు.
ఉదయమే హరీష్‌, సుభద్ర పిల్లల్ని తీసుకొని ఆటోలో తాతయ్య రఘురాం దగ్గరకు బయలుదేరారు. ఆటో నగరం చివరికి వెళ్లి ఆగింది. ‘కరుణాశ్రమం’ అనే బోర్డు కనబడింది. అది ఒక వృద్ధాశ్రమం. గేటు దగ్గర వాళ్లు హరీష్‌ని వివరాలు అడిగి లోపలికి పంపించారు. ఓ చెట్టు కింద రఘురాం కూర్చొని ఉన్నాడు.తాతయ్యని చూసి మనవళ్ళు సుభాష్‌, మనీష అల్లుకుపోయారు. హరీష్‌ తండ్రితో ‘నాన్నా! బాగున్నావా..!’ అని పలకరించాడు. కోడలు కూడా పలకరించింది. ‘బాగానే ఉన్నానులే’ అని ఏదో ముక్తసరిగా రఘురాం జవాబు ఇచ్చారు. కాసేపు మనవళ్ళతో కబుర్లు, కథలు చెప్పాడు. ఇంటి దగ్గర నుంచి తెచ్చిన ఆహారాన్ని అందరూ కలిసి చెట్టు నీడలో కూర్చొని తిన్నారు.
సాయంత్రం అయ్యింది. హరీష్‌ ఇంటికి బయలుదేరుదాం అన్నాడు. ఇంతలో సుభాష్‌, తండ్రి హరీష్‌తో ‘నాన్నా! నువ్వు కూడా ముసలవాడివయ్యాక, మేం ఇక్కడే చేర్పించాలా?’ అని అడిగాడు.
పిల్లలు అడిగిన ప్రశ్నలతో హరీష్‌, సుభద్రల ముఖాలు ఒక్కసారిగా వాడిపోయాయి. బాగా ఆలోచించారు. ఇప్పుడు ఈ వయసులోనే తమ పిల్లలకు ఏది నేర్పిస్తే..అదే అనుసరిస్తారని అనుకున్నారు.
హరీష్‌ వెంటనే ఆశ్రమం మేనేజర్‌ను కలిసి తన తండ్రి రఘురాంను తన ఇంటికి తీసుకెళుతున్నట్టు వారిచ్చిన పత్రాలలో సంతకం పెట్టాడు. తండ్రి రఘురాం దగ్గరకు వచ్చి ‘నాన్నా! మనం ఇంటికి వెళ్తున్నాం’ అని అన్నాడు. రఘురాం ముఖం ఆనందంతో వికసించింది. సుభాష్‌, మనీషలు కూడా తాతయ్య తమతోనే ఉంటాడని తెలుసుకొని చాలా ఆనందపడ్డారు. అందరూ ఆటోలో తిరిగి ఇంటికి చేరుకున్నారు.

మొర్రి గోపి
8897882202

➡️