కానరాని చినుకు జాడ

Jun 21,2024 22:44
కానరాని చినుకు జాడ

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధిఈ ఏడాది కూడా వానలు ఆలస్యమవుతున్నాయి. వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నప్పటికీ రుతుపవనాల జాడ కనిపించడం లేదు. మరోవైపు సాగునీటి లభ్యత అంతంత మాత్రంగానే కనిపిస్తోంది. పూడిక తీత పనులు జరగకపోవడంతో ఈ నెల 1న కాలువలకు నీరు విడుదల చేసినప్పటికీ సాగునీరు అందని దుస్థితి నెలకొంది. దీంతో ఈ ఖరీఫ్‌ సీజన్‌ సకాలంలో పూర్తి అయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో పంట చేతికందే సమయంలో ప్రకతి వైపరీత్యాలను తలచుకుని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది జిల్లావ్యాప్తంగా ఖరీఫ్‌లో 3.10 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అధికారులు ప్రణాళిక రూపొందించారు. వరి 2,26,685 ఎకరాల్లో, మొక్కజొన్న 587 ఎకరాల్లో, అపరాలు 2667 ఎకరాల్లో, పత్తి 7,992 ఎకరాల్లో, చెరకు 5,520 ఎకరాల్లో సాగు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఖరీఫ్‌ సాగు కోసం రైతులు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే పొలాలను దుక్కులు దున్ని సిద్ధంగా ఉన్నారు. ముందస్తుగా సాగు పనులకు సిద్ధమవుతున్న తరుణంలో వానల ఆలస్యం అశనిపాతంగా మారుతుంది. అటు మెట్ట, ఇటు డెల్టా ప్రాంతాల్లో సాగుకు అనుగుణంగా పరిస్థితులు ఏర్పడతాయని ఆశిస్తే అందుకు భిన్నమైన వాతావరణం కనిపిస్తున్న తరుణంలో ఆవేదన చెందుతున్నారు.జూన్‌ నాలుగో వారం వచ్చినా రుతుపవనాలు పూర్తిగా వ్యాపించలేదు. అంతకముందు కురిసిన అడపాదడపా వర్షాలు మినహా పూర్తిస్థాయిలో వ్యవసాయానికి అనుగుణంగా వానలు పడిన పరిస్థితి లేదు.ఈ నేపథ్యంలో సాగునీటి లభ్యత కూడా అంతంతమాత్రంగానే కనిపిస్తుంది.వర్షాధార పంటలపై ప్రభావంఏటా జూన్‌ మొదటి వారంలోనే రుతుపవనాలు జిల్లాలోకి ప్రవేశిస్తున్నాయి. కేవలం నైరుతి రుతుపవనాల కాలంలోనే సగటున 1000కి పైగా మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతోంది. జూన్‌ నెలాఖరు నుంచి జూలైలో భారీగా వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కానీ ఈసారి అలాంటి పరిస్థితులు రాలేదు. వర్షాలు రాకపోతే మెట్ట ప్రాంతాల్లో వర్షాధార పంటలు సాగుచేస్తున్న రైతులు, అటు ఏజెన్సీలోనూ, ఇటు మెట్ట ప్రాంతంలోనూ వాన కోసం ఎదురు చూపులు తోనే గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో సాగు అస్తవ్యస్తంగా మారే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.సకాలంలో సాగునీరు అందితేనే..మెట్ట ప్రాంతంలో పత్తి, కూరగాయలు, ఇతర ఉద్యాన పంటలన్నింటికీ వర్షాలు సకాలంలో కురిస్తేనే పంట చివర్లో తుపాలను బారిన పడకుండా గట్టెక్కే అవకాశం ఉందని రైతులు భావిస్తున్నారు. డెల్టాలో కూడా సకాలంలో సాగునీరు అందితే సెప్టెంబరు, అక్టోబరు నాటికి తుపానులు, వరదల నుంచి గట్టెక్కవచ్చునని ఆశిస్తున్నారు. కానీ ఇప్పుడు మాత్రం వాతావరణం అందుకు సహకరించడం లేదు. ఈ ఏడాది కూడా ఖరీఫ్‌లో ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందోనని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.అరకొరగానే సాగునీరుజూన్‌ 1నే గోదావరి డెల్టాలో సాగునీటి కోసం ధవళేశ్వరం బ్యారేజీ నుంచి నీటిని విడుదల చేసినప్పటికీ అంతంతమాత్రంగానే లభిస్తోంది. కాకినాడ జిల్లాలో ఇప్పటి వరకు కేవలం కొన్ని మండలాల్లో కొంతమేర మాత్రమే నారుమళ్లు సిద్ధం చేశారు. ఈ సమయానికి సుమారు వెయ్యి ఎకరాల్లో నారు మళ్లు సిద్ధం చేయాల్సి ఉండగా నీటి లభ్యత సక్రమంగా లేకపోవడంతో సుమారు 600 ఎకరాల్లో మాత్రమే సిద్ధమయ్యాయి. వివిధ ప్రాంతాల్లో ఇప్పటికే 250 ఎకరాల్లో వెదజల్లు సాగు పూర్తి కావలసి ఉండగా ఇప్పటి వరకు సుమారు 50 ఎకరాల్లో మాత్రమే వేశారు. అయితే రైతులు ఎక్కువగా బెంగాల్‌ ఊడుపులకు మొగ్గు చూపుతున్నారు. సాగునీరు గనుక పూర్తిస్థాయిలో లభ్యమైతే జూన్‌ నెలాఖరు నుంచి నాట్లు ప్రారంభమై జూలై నెలాఖరుకు పూర్తి కావాల్సి ఉంది. ఇప్పుడున్న ఇబ్బందులను బట్టి చూస్తే ఆగస్టు చివరి నాటికి కూడా నాట్లు పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. గోదావరి కాలువలతో పాటు ఏలేరు, బిబిసి, పుష్కర కాలువల ఆధునీకరణ లేకపోవడంతో రైతులు ప్రతి సంవత్సరం అతివృష్టి, అనావృష్టి పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. నూతన ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో రైతాంగ సమస్యల పరిష్కారానికి కాలువల్లో పూడికతీత పనులు చేపట్టడంతో పాటు సకాలంలో సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని పలువురు రైతులు కోరుతున్నారు.

➡️