వైసిపి పాలనలో ఎస్‌సిలకు తీరని అన్యాయం

May 5,2024 23:15
వైసిపి పాలల్లో ఎస్‌సిలకు తీరని

ప్రజాశక్తి – కోటనందూరు

వైసిపి పాలల్లో ఎస్‌సిలకు తీరని అన్యాయం జరిగిందని సమతా సైనిక్‌ దళ్‌ రాష్ట్ర కార్యదర్శి యెర్రం సుధీర్‌కుమార్‌ అన్నారు. ఆదివారం తునిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఐదేళ్ల వైసిపి పాలనలో ఎస్‌సిలు, బిసిలకు అవుట్‌సోర్సింగ్‌, కాంట్రాక్టు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు, రోస్టర్‌ విధానం అమలు కాలేదన్నారు. గత ప్రభుత్వాల్లో ఎస్‌సిలకు అమలు చేసిన 27 సంక్షేమ పథకాలను సైతం సిఎం జగన్మోహన్‌ రెడ్డి రద్దు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు విద్యార్థులకు ఫీజు రీయంబర్స్‌మెంట్‌, విదేశీ విద్య, స్కాలర్‌ షిప్‌ పథకాలను రద్దుచేసి విద్యార్థులకు తీరని అన్యాయం చేశారని దుయ్యబట్టారు. ఎస్‌సి ప్రాంతాల అభివృద్ధికి వినియోగించాల్సిన ఎస్‌సి సబ్‌ ప్లాన్‌ నిధులను సైతం దారి మళ్లించి వారికి తీరని అన్యాయం చేశారని అన్నారు. ఒకపక్క ఎస్‌సిల అభివృద్ధికి తీరని ద్రోహం చేసిన జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వంలోనే మరోపక్క ఎస్‌సిలపై దాడులు, హత్యలు, అత్యాచారయత్నాలు వంటి సంఘటనలు పెరిగిపోయాయని అన్నారు. ఎస్‌సి యువకుడిని హత్య చేసి మృతదేహాన్ని డోర్‌ డెలివరీ చేశారని, అలాగే పోలీస్‌స్టేషన్‌లోనే దళిత యువకుడిని శిరోముండనం చేసిన ఉదంతాలు ఉమ్మడి గోదావరి జిల్లాలోనే చోటుచేసుకున్నాయని అన్నారు. అలాగే వెంకటాయపాలెంలో దళితులకు శిరోముండనం చేసి నిందుతులకు కోర్టు శిక్ష విధించిందని, అయినా ఆ నిందుతుడికి ఎంఎల్‌ఎ అభ్యర్థిగా వైసిపి పోటీలో నిలిపిందని అన్నారు. దళిత వ్యతిరేక పార్టీగా నిలిచిన వైసిపిని రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో తుని నియోజకవర్గ సమతా సైనికుల అధ్యక్షులు బోడపాటి శ్రీను, తుని నియోజకవర్గ కార్యదర్శి శాఖ రామకృష్ణ, సభ్యులు ప్రసన్న, ప్రేమ్‌ కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

➡️