తాగునీటికి కటకట..!

May 12,2024 22:47
సంవత్సరాలు గడుస్తున్న ఏ

ప్రజాశక్తి – కరప

సంవత్సరాలు గడుస్తున్న ఏ ప్రభుత్వం వచ్చినా సమస్య పరిష్కారం కాదు. సామూహిక రక్షిత మంచినీటి ప్రాజెక్టులు కోట్ల రూపాయలతో నిర్మించి ఉన్న ఎండ మావులుగా మిగులుతున్నాయి. ప్రాజెక్టుల్లో పెరుగుతున్న చేపలను అమ్ముకుని సొమ్ములు చేసుకునేందుకు చేస్తున్న చొరవ నీటి సరఫరా సక్రమంగా చేసేందుకు నాయకులకు మనసు రావడం లేదని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.కరప మండల ప్రజలు తాగునీరు కోసం కటకట లాడుతున్నారు. కరప మండలంలోని 23 గ్రామాలు ఉండగా 33 వాటర్‌ హెడ్‌ ట్యాంకులు ఉన్నాయి. 2 సామూహిక రక్షిత మంచినీట ప్రాజెక్టులు కరప, వేళంగిలో ఉన్నాయి. కరప ప్రాజెక్టు ద్వారా 8 గ్రామాలకు, వేళంగి ప్రాజెక్టు ద్వారా 12 గ్రామాలకు నీరు సరఫరా చేస్తున్నారు. చెప్పుకోవడానికి తప్ప వీటి ద్వారా తాగునీరు సరఫరా సక్రమంగా జరగడం లేదు. సరఫరా జరిగిన కొద్దిపాటి సమయము మాత్రమే ఇవ్వటం జరుగుతుంది. సరఫరా అయిన నీరు నీచు వాసనతో తాగేందుకు పనికిరాకుండా వాడకపు నీరుగా మిగులుతుంది. వాటర్‌ హెడ్‌ ట్యాంకులు మాత్రం హడావిడిగా ఏ ప్రభుత్వంలో నైనా నిర్మించడం జరుగుతుంది. వాటర్‌ హెడ్‌ ట్యాంకులు నిర్మాణాలు రంగులు వేసుకోవడానికి తప్ప దాని ద్వారా రక్షిత తాగునీరు సరఫరా సక్రమంగా జరగటం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. మండలంలోని ప్రతి గ్రామంలోని ఇదే పరిస్థితి నెలకొంది. ప్రధానంగా మండల కేంద్రమైన కరప గ్రామంలోని సామూహిక రక్షిత తాగునీరు ప్రాజెక్ట్‌ రూ.20 కోట్లతో నిర్మించారు. ఇది వినియోగంలోకి వచ్చి ఐదు సంవత్సరాలు పూర్తవుతున్న ఇప్పటికీ పూర్తిస్థాయిలో తాగునీటి సరఫరా సాగడం లేదు. కరప గ్రామ ప్రజలు ఆర్‌ఒ ప్లాంట్లపై ఆధారపడి డబ్బులకు కొనుగోలు చేసుకోవాల్సిన దుస్థితి ఉంది. కొందరు ఆర్‌ఒ ప్లాంట్‌ నీటిని వినియోగించలేక పెనుగుదురు నుంచి కరప వాటర్‌ హెడ్‌ ట్యాంకు సరఫరా అవుతున్న నీటి కోసం ఊరి శివారుకు వెళ్లి తెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో తాగునీటి కష్టాలు ప్రభావం చూపే అవకాశం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

➡️