రాజులోవ మృతి తీరని లోటు

May 26,2024 21:13 #CITU leader, #dead, #tribute
  • సంతాప సభలో వక్తల నివాళి
  • ముగిసిన అంత్యక్రియలు

ప్రజాశక్తి- రౌతులపూడి (కాకినాడ జిల్లా) : సిఐటియు తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి రాజులోవ మృతి తీరని లోటని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.ఉమామహేశ్వరరావు అన్నారు. శనివారం మృతి రాజులోవ అంత్యక్రియలు కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం ములగపూడిలో ఆదివారం జరిగాయి. అనంతరం సిపిఎం కాకినాడ జిల్లా కన్వీనర్‌ ఎం.రాజశేఖర్‌ అధ్యక్షతన జరిగిన సంతాప సభలో వి.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ లోవరాజు విద్యార్థి దశ నుంచి ఎస్‌ఎఫ్‌ఐ పట్ల ఆకర్షితులై అంచెలంచెలుగా ఎదిగి పార్టీకి సేవలందించారన్నారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ పార్టీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న రాజులోవ చిన్న వయస్సులోనే మృతి చెందడం బాధాకరమని పేర్కొన్నారు. ఆయన కుటుంబానికి సిపిఎం రాష్ట్ర కమిటీ తరఫున సంతాపం తెలిపారు. సిఐటియు అఖిల భారత ఉపాధ్యక్షులు జి.బేబిరాణి మాట్లాడుతూ రాజులోవ మృతి కార్మిక లోకానికి తీరని లోటన్నారు. డివైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు వై.రాము మాట్లాడుతూ రాజులోవ డివైఎఫ్‌ఐలోనూ చురుగ్గా పనిచేశారన్నారు. అంత్యక్రియల్లో సిపిఎం తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి అరుణ్‌, విజయవాడ ఎంబివికె బాధ్యులు టి.క్రాంతి, సిఐటియు ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శి డిఎన్‌విడి.ప్రసాద్‌, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు సుందర్‌బాబు, అనకాపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి జి.కోటేశ్వరరావు, రాజులోవ కుటుంబ సభ్యులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.
రాజులోవ మృతి పట్ల సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు. లోవరాజు కుటుంబసభ్యులకు సానుభూతి తెలియజేశారు.

➡️