‘సమస్యాత్మకం’పై ప్రత్యేక దృష్టి

Apr 6,2024 23:01
ప్రతిష్టాత్మక సార్వత్రిక

ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి

ప్రతిష్టాత్మక సార్వత్రిక ఎన్నికల్లో పైచేయి కోసం పార్టీలు పెద్ద ఎత్తున ప్రయత్నాలు సాగిస్తున్నాయి. గెలుపే లక్ష్యంగా ఎత్తులు వేస్తున్నాయి. ప్రలోభాలకు గురిచేసి విజయం సాధించేందుకు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించే పరిస్థితులు కన్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసేందుకు పోలీసులు అన్ని విధాలా సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రధానంగా ప్రశాంత ఎన్నికలే లక్ష్యంగా పనిచేస్తున్నారు. జిల్లాలో 1,637 పోలింగ్‌ కేంద్రాల్లో 15,99,065 మంది ఓటర్లుగా నమోదు అయ్యారు. ఇందులో పురుష ఓటర్లు 7,88,105 మంది, 8,10,781 మంది స్త్రీ ఓటర్లు, 179 మంది ఇతరులుగా ఉన్నారు. కాకినాడ పార్లమెంట్‌, ఈ పరిధిలో 7 నియోజకవర్గాల్లో ఇబ్బందులను పరిష్కరించేందుకు పోలీసుశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేసింది. గ్రామాల్లో అనుమానాస్పద వ్యక్తులతోపాటు కేసులున్న వారి పట్ల నిరంతరం నిఘా కొనసాగిస్తున్నారు. రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్‌ ఇచ్చి బైండోవర్‌ చేస్తున్నారు. జిల్లాలో 160 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలున్నాయి. వీటిని ప్రత్యేకంగా గుర్తించి ప్రశాంత వాతావరణానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారు.2,500 మందికిపైగా పోలీసు బందోబస్తుజిల్లాలో జరగనున్న 7 నియోజకవర్గాల్లో ఎన్నికలకు అవసరమైన బందోబస్తు ఏర్పాట్లకు ప్రణాళికలు రూపొందించారు. అందులో భాగంగా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. అడిషనల్‌ ఎస్‌పిలతోపాటు డిఎస్‌పిలు, సిఐలు, ఎస్‌ఐలతోపాటు, మిగిలిన ఎఎస్‌ఐలు, హెచసిలు, కానిస్టేబుల్స్‌, హోంగార్డులు, ఆర్మీ రిజర్వుడు, స్పెషల్‌ పోలీసులు ఇలా 2,500 మందికి పైనే బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. కేంద్ర బలగాలను అందుబాటులో ఉంచారు. ప్రతి పోలింగ్‌ బూత్‌ వద్ద ఎన్నికల అధికారులు ఓటర్ల భద్రతకు సిఐ, ఎస్‌ఐ స్థాయి అధికారులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నారు. వీరు బాడీ టచ్‌ కెమేరాలు ధరించి ఉంటారు. ప్రతి పోలింగ్‌ బూత్‌ పోలీస్‌ సీసీ కెమేరాలతో కంట్రోల్‌ రూముకు అనుసంధానం చేస్తారు. వీటి ద్వారా బూత్‌ స్థాయిలో శాంతిభద్రతలపై ఎప్పటికప్పుడు నిర్దిష్టమైన పర్యవేక్షణ చేయడానికి వీలుంటుంది. ఇలా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు చేపడుతున్నారు.

రౌడీ షీటర్లపై బైండోవర్‌

జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిపించడం కోసం అవసరమైన అన్ని చర్యలు చేపడతున్నారు. అందుకోసం ఆయా ప్రాంతాల్లో ఉన్న రౌడీషీటర్లను పోలీసు స్టేషన్లకు పిలిపించి కౌన్సెలింగ్‌ ఇస్తున్నారు. గత ఎన్నికల్లో వివాదాలకు కారకులైన వారు, రాజకీయ వివాదాలు, ఘర్షణల్లో కీలకంగా వ్యవహరిస్తున్న వ్యక్తులను బైండోవర్‌ చేసి, ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నారు.

సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక నిఘా

జిల్లాలో సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక నిఘా ఉంచుతున్నారు. ప్రధానంగా ముఠా కక్షలు, గ్రూపుల కక్షలు ఉన్న ప్రాంతాలను నాలుగు విభాగాలుగా విభజించి అందుకు అనుగుణంగా బందోబస్తు చర్యలు చేపడుతున్నారు. 160 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఉంచడంతోపాటు గ్రూపుల నాయకులు, ఇతర నాయకులపై కూడా నిఘాను కొనసాగిస్తున్నారు.

అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా

ఎన్నికల నేపథ్యంలో అనుమానాస్పద వ్యక్తులతోపాటు నేరచరిత్ర కలిగిన వారిపై పోలీసులు నిఘా ఉంచారు. ప్రత్యేక సమాచారం ద్వారా అలాంటి వారి కదలికలను కని పెడుతున్నారు. ఆయా ప్రాంతాల్లో చిచ్చు పెట్టే వారితోపాటు గొడవలు సృష్టించే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. గతంలో ఎన్నికల సందర్భంగా రచ్చ చేసిన వారిపై కూడా నిఘా ఉంచారు.

14 చెక్‌ పోస్టుల ఏర్పాటు

సార్వత్రిక ఎన్నికల తరుణంలో ప్రధాన ప్రాంతాల్లో పాతవి 10 ఉండగా కొత్తగా మరో 4 చెక్‌ పోస్టులను ఏర్పాటు చేశారు. జిల్లా సరిహద్దులతోపాటు డివిజన్‌ కేంద్రాల్లోనూ చెక్‌ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. యానాం, తుని, రంగంపేట, గండేపల్లిలలో చెక్‌ పోస్టులున్నాయి. డబ్బు, మద్యం, ఇతరత్రా ఎలాంటి అక్రమ రవాణా జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు.

తుపాకులను స్వాధీనం

జిల్లాలోని పలువురు నేతలతోపాటు ఇతర వర్గ నాయకులు,ప్రజల వద్ద ఉన్న లైసెన్సుడు తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలో 324 తుపాకులకు అనుమతి ఉండగా, ఇప్పటికే 263 స్వాధీనం చేసుకున్నారు. వీటిని తిరిగి కౌంటింగ్‌ పూర్తయిన తర్వాత తిరిగి అప్పగిస్తారు. అత్యవసర సేవల కోసం 61 తుపాకులను మినహాయింపు ఇచ్చారు.

సమస్యాత్మక గ్రామాల్లో కవాతు

ప్రశాంత ఎన్నికలే లక్ష్యంగా ప్రజల్లో ధైర్యం నింపేందుకు కేంద్ర సాయుధ బలగాలతో సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల పరిధిలో కవాతు జిల్లా పోలీసులు కవాతు నిర్వహిస్తున్నారు. శాంతిభద్రతలకు ఎటువంటి విఘాతం కలగకుండా ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించు కొనేందుకు, ప్రజల భద్రతకు భరోసా కల్పించుటకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

➡️