ముంపు నివారణకు చర్యలు తీసుకోండి

Jun 29,2024 12:44 #Kakinada

కమిషనర్ జే.వెంకటరావు ఆదేశం

ప్రజాశక్తి-కాకినాడ : వర్షం కారణంగా ఏర్పడే ముంపు సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ జే.వెంకటరావు పేర్కొన్నారు. స్థానిక లక్ష్మీనారాయణ నగర్ ప్రాంతంలోని మదర్ థెరిసా విగ్రహం నుంచి ఫౌండేషన్ ఆసుపత్రి మీదుగా చర్చి వరకు ముంపునకు గురైన ప్రాంతాన్ని కమిషనర్ శనివారం సందర్శించారు. శుక్రవారం అర్ధరాత్రి కురిసిన వర్షం కారణంగా ఆ ప్రాంతం నీట మునగడంతో కమిషనర్ అధికారులతో కలిసి ఆ ప్రాంతాన్ని సందర్శించారు. ముంపు సమస్య ఎదుర్కొనేందుకు తీసుకోవలసిన చర్యలపై ఇంజనీరింగ్, ప్రజారోగ్య విభాగానికి చెందిన అధికారులతో చర్చించారు. రహదారులను ఎత్తు చేసేందుకు అవసరమైన అంచనాల రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఈ లోపుగా అవుట్లెట్లను శుభ్రం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వర్షం కారణంగా ముంపునకు గురయ్యే ప్రాంతాలను గుర్తించి పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటికే పూడికతీత పనులు చాలా వరకు పూర్తయ్యాయని కమిషనర్ చెప్పారు.అలాగే వర్షాలు పడుతున్న నేపథ్యంలో పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన ప్రజారోగ్య విభాగాన్ని ఆదేశించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఆయన వెంట కాకినాడ నగరపాలక సంస్థ ఎంహెచ్ఓ డాక్టర్ పృథ్వీ చరణ్, ఏఈ వై. నాగేశ్వరరావు, శానిటరీ సూపర్వైజర్ రాంబాబు, సచివాలయ ఉద్యోగులు ఆయన వెంట ఉన్నారు.

➡️