ప్రాణం పోయాల్సిన డాక్టరే…

Apr 30,2024 23:35

కుటుంబాన్ని కడతేర్చి తానూ తనువు చాలించాడు

ఆర్థిక ఇబ్బందులే కారణంగా భావిస్తున్న పోలీసులు

ప్రజాశక్తి – విజయవాడ అర్బన్‌

డాక్టర్‌ దేవుడితో సమానమని నమ్ముతాం. అందుకే మనకు శరీరంలో ఎటువంటి ఇబ్బంది, తేడా వచ్చినా డాక్టర్‌ వద్దకు వెళ్లి చెప్పుకుంటాం. కానీ ప్రాణం పోసే డాక్టరే తీవ్ర మనస్థాపానికి గురై తీవ్ర మానసిక వత్తిడికిలోనై తాను చనిపోవడమే కాకుండా భార్య, ఇద్దరు సంతానంతోపాటు తల్లిని కూడా చంపిన ఘటన నగరంలో తీవ్ర కలకలం రేపింది. ఈ సంఘటన నగరంలోని గురునానక్‌ కాలనీలో చోటుచేసుకుంది. కుటుంబ ఆర్థిక ఇబ్బందులతోపాటు కొంత మంది స్నేహితుల నమ్మక ద్రోహం కారణంగానే ఈ సంఘటన చోటుచేసుకోవడం సంచలనం కలిగిచింది. నగరానికి చెందిన ప్రముఖ ఆర్థోపెడిక్‌ వైద్యులు డాక్టర్‌ శ్రీనివాస్‌ చక్కటి వైద్యం చేయడంతోపాటు అందరినీ చిరునవ్వుతో పలుకరిస్తూ వ్యాధిని సగం తగ్గిస్తుంటారని చెబుతుంటారు. అటువంటిది ఆయనే తనకు వచ్చిన కష్టం ఎవరికీ చెప్పుకోలేక తీవ్ర మనస్థాపం చెంది చివరకు ఆత్మహత్యచేసుకున్నారు. నగరంలోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో సుమారు ఐదేళ్లపాటు వైద్యునిగా సేవలందించి తనే సొంతంగా ఆసుపత్రి ప్రారంభించి ఇంకా ఎక్కువ మందికి వైద్య సేవలు అందించాలని ఆశించారు. పుష్పా హోటల్‌ సెంటర్‌ సమీపంలో కొద్దిపాటి స్థలంలో అత్యాధునిక సదుపాయాలతో ఏడాదిన్నర క్రితం ఆసుపత్రిని నిర్మించి ప్రారంభించారు. అయితే అనుకున్న స్థాయిలో రోగులు రాకపోవడం.. రోజురోజుకూ నిర్వహణా భారం పెరగడంతో ఆసుపత్రి నడపటం సాధ్యం కావడం లేదు. దీంతో ఇటీవలే నిడమానూరుకు చెందిన ఓ ప్రయివేటు ఆసుపత్రికి నిర్వహణా బాధ్యతలు అప్పగించారు. దీంతోపాటు ఇదే ఆసుపత్రిలో తాను కూడా సేవలు అందించే విధంగా ఒప్పందం చేసుకున్నారు. నెల క్రితం కొత్త యాజమాన్యం ఆసుపత్రికి అన్ని హంగులు ఏర్పాటుచేసి ప్రారంభించింది. అయితే అప్పటికే ఆర్థిక భారంతోపాటు కొందరు స్నేహితులు కూడా నమ్మపలికి కొంత మోసం చేయడంతో డాక్టర్‌ శ్రీనివాస్‌ పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్లిపోయాడని బంధువులు, పోలీసులు చెబుతున్నారు. తన పిల్లలన్నా, భార్య, తల్లి అన్నా శ్రీనివాస్‌కు ఎంతో ఇష్టమని చెబుతున్నారు. తాను ఆత్మహత్య చేసుకుంటే వారిని ఎవరు చూస్తారని భావించి హత్య చేసినట్లు చెబుతున్నారు. తన ఇద్దరు పిల్లల్లో ఒకరు ఆటిజం సమస్యతో బాధపడుతున్నారు. దీంతో కుమార్తె ఇంటికి సమీపంలోనే ప్రయివేటు పాఠశాలలో చదువుతోంది. విచారణ వేగవంతం గురునానక్‌ కాలనీలో నివాసం ఉంటున్న డాక్టర్‌ డి.శ్రీనివాస్‌ (40) తన భార్య ఉష (38), కుమార్తె శైలజ (9), శ్రీహాన్‌ (8), తల్లి రమణమ్మ (65)లను గొంతుకలు కోసి చంపి, ఆ తర్వాత ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న కేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారు. మంగళవారం వెలుగుచేసిన ఈ కేసులో శ్రీనివాస్‌ కారులో ఉన్న ట్రావెల్‌ బ్యాగును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంటి ఆవరణలోనే ఉన్న కారులో ఉంచిన బ్యాగులో విలువైన వస్తువులు, డాక్యుమెంట్లు, బంగారు ఆభరణాలు, కొద్ది మొత్తంలో నగదు ఉన్నట్లు గుర్తించారు. ఎదురింట్లో ఇచ్చిన తాళం ద్వారా కారు తెరచి చూడగా అందులో బ్యాగు లభ్యమైంది. కారు తాళాలను తన అన్నకు ఇవ్వాలని రాసి ఎదురింటి పోస్ట్‌బాక్స్‌లో వేసిన లెటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. శ్రీనివాస్‌ కుటుంబ సభ్యుల మృతదేహాలను పంచనామా అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మందుల షాపులో రెండు కత్తులు కొనుగోలుడాక్టర్‌ శ్రీనివాస్‌ కుటుంబంలో విషాదాన్ని పరిశీలిస్తే… పథకం ప్రకారమే ఈ ఘటన జరిగినట్లు అర్థమవుతోందని పోలీసులు చెబుతున్నారు. సోమవారం సాయంత్రం శ్రీనివాస్‌ తన ఇంటికి సమీపంలోని మెడికల్‌ షాపులో రెండు సర్జికల్‌ కత్తులను కొనుగోలు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ఆ మెడికల్‌ షాపుకు వెళ్లి ఎప్పుడు ఏమి కొన్నదీ సిసి కెమేరా ద్వారా పరిశీలిస్తున్నారు. శ్రీనివాస్‌ మంచి వ్యక్తి : స్నేహితులుడాక్టర్‌ శ్రీనివాస్‌ చాలా మంచి వ్యక్తని, అందరితో చక్కగా మాట్లాడతారని, ఎవరితోనూ విభేదాలు లేవని ఆయన స్నేహితులు తెలిపారు. గత ఏడాదే సొంతంగా శ్రీజ హాస్పిటల్‌ను ప్రారంభించారని తెలిపారు. అయితే హాస్పటల్‌ పూర్తి స్థాయిలో నడవకపోవడంతో కొంత ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పాడని వివరించారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఇలా చేసి ఉండొచ్చని స్నేహితులు భావిస్తున్నారు. భార్యను, ఇద్దరు పిల్లలను, తల్లిని హత్య చేశాడంటే నమ్మలేకపోతున్నామని ఆదేదన వ్యక్తం చేశారు.

➡️