‘సిద్ధం’తో ప్రజలకు నిరాశే మిగిలింది : టిడిపి

Apr 16,2024 23:07

ప్రజాశక్తి-గుడివాడ

గుడివాడలో జరిగిన సిద్ధం సభ పూర్తిగా విఫలమైందని టిడిపి అభ్యర్థి వెనిగండ్ల రాము విమర్శించారు. మంగళవారం స్థానిక 35వ వార్డు పర్యటనలో భాగంగా గణేష్‌సాయి ఎలక్ట్రానిక్స్‌ అధినేత కొత్త చంద్రశేఖర్‌ స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, జనసేన ఇన్‌చార్జి బూరగడ్డ శ్రీకాంత్‌, బిజెపి పట్టణాధ్యక్షుడు యర్రబోతు అర్జున్‌లతో కలిసి అయన మాట్లాడుతూ సిఎం గుడివాడ వచ్చారంటే ఎన్నో వరాలు ప్రకటిస్తారని ఎదురుచూసిన ప్రజలకు నిరాశే మిగిలిందన్నారు. సభలో జగన్‌ మాట్లాడుతుంటే పిట్ట కథలు చెప్పే వాడిగా తనను తాను పొగుడుకుంటూ ప్రజలకు చిరాకు తెప్పించారన్నారు. సభలో కొడాలి నాని మాట్లాడుతూ జగన్‌ నీతిమంతుడని ఇంత వరకు అబద్దాలు ఆడలేదని చెప్పారన్నారు. సభలో జగన్‌ మాట్లాడుతూ మరో అవకాశం కొడాలికి ఇస్తే తాను దగ్గర ఉండి పని చేయిస్తానని చెప్పడం జరిగిందని, కొడాలి ఇప్పటివరకు గుడివాడకు ఏమీ చేయలేదని సాక్షాత్తూ ముఖ్యమంత్రి ఒప్పుకున్నట్లు అయ్యిందని అన్నారు. సభలో టిడ్కో గృహాలపై కానీ, గుడివాడ అభివృద్ధిపై కానీ మాట్లాడకపోవడం శోచనీయమన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు గుండెమడ రాఘవేంద్రరావు, కొత్త మురళీకృష్ణ, కొండేటి ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️