8, 9వ తేదీల్లో కర్నూలు బాలోత్సవం వేడుకలు

Feb 4,2024 16:50 #Balotsavam, #Kurnool
  • వేడుకలకు 3వేలమంది విద్యార్థులు
  • బాలోత్సవ నిర్మాణ కమిటీ వెల్లడి

ప్రజాశక్తి కర్నూలు కలెక్టరేట్ : ఫిబ్రవరి 8 మరియు 9 తేదీల్లో నిర్వహించనున్న కర్నూల్ మూడవ బాలోత్సవం వేడుకలను ఇండస్ పాఠశాలలో నిర్వహిస్తున్నట్లు బాలోత్సవ కమిటీ అధ్యక్షుడు బడేసాహెబ్ ఆర్గనైజింగ్ కార్యదర్శి కెంగారమోహన్ ఉపాధ్యక్షులు పత్తి ఓబులయ్యలు వెల్లడించారు. ఆదివారం నగరంలోని స్థానిక లలిత కళా సమితిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు పలు వివరాలను వెల్లడించారు. ఈనెల 8 9 తేదీల్లో బాలోత్సవంను పండుగగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. రెండు రోజులపాటు జరిగే ఈ ఉత్సవాలలో కర్నూల్ డివిజన్ పరిధిలోని 250 పాఠశాలలు పాల్గొంటారని పేర్కొన్నారు. దాదాపుగా 3000 మంది విద్యార్థులు రెండు రోజులపాటు జరిగే ఉత్సవాల్లో భాగస్వామ్యం అవుతున్నారని పేర్కొన్నారు. మొదటిరోజు వేడుకలను జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన జాతీయ పతాక ఆవిష్కరణ చేసి ఉత్సవాలను ప్రారంభిస్తారన్నారు. బాలోత్సవాల నిర్వహణకు మూడు వేదికలు సిద్దం చేశామని ప్రధాన వేదిక మాంటిస్సోరి విద్యాసంస్థల అధినేత కళ్యాణమ్మ పేరుతో ఏర్పాటు చేశామని, రెండో వేదిక జెవివి, యూటిఎఫ్ సీనియర్ నాయకులు చెన్నకేశవరెడ్డి కళావేదికగానూ, మూడవ వేదిక యూటిఎఫ్ యంఎల్సీ షేక్ సాబ్జీ పేరుతో ఏర్పాటు చేశామన్నారు. రెండో రోజు జరిగే ఉత్సవాలకు పాఠశాల విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ మువ్వా రామలింగం పాల్గొంటారన్నారు. వీరితోపాటు గౌరవ అధ్యక్షులు జి పుల్లయ్య, రాజశేఖర్, ప్రముఖ వైద్యులు డాక్టర్ భరత్ డాక్టర్ సతీష్ డాక్టర్ వినోద్ కూడా పాల్గొంటారన్నారు. విద్యార్థులకు ప్రధానంగా మన సంస్కృతి సంప్రదాయాలపై అవగాహన కల్పించేందుకు, సృజనాత్మక వెలికితీసేందుకు ఈ ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ ఉత్సవాలలో విద్యార్థులు పాల్గొనేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని కోరారు. దాదాపు పన్నెండు ఈవెంట్లలలో విద్యార్థులు పాల్గొంటారని వివరించారు. విద్యార్థులకు డ్యాన్స్ సింగింగ్ పోటీలతోపాటు వ్యాసరచన, వకృత్వ పోటీలతో పాటు అనేక అంశాలలో ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఉత్సవాలను జయప్రదం చేయాలని వారు కోరారు. ఈ సమావేశంలో కమిటీ ప్రధాన కార్యదర్శి జె ఎన్ శేషయ్యతో పాటు యూటీఎఫ్ రాష్ట్ర సహాధ్యక్షుడు కే సురేష్ కుమార్ ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి ఎం.పి బసవరాజు తదితరులు పాల్గొన్నారు.

➡️