మున్సిపల్‌ కార్యాలయం ముట్టడి

Jan 6,2024 20:02

ఎమ్మిగనూరు కార్యాలయం ముందు బైఠాయించిన మున్సిపల్‌ కార్మికులు

– సిఐటియు, ఎఐటియుసి, ఐఎఫ్‌టియు నాయకుల అరెస్టు
ప్రజాశక్తి – ఎమ్మిగనూరు
మున్సిపల్‌ కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని శనివారం మున్సిపల్‌ కార్యాలయాన్ని ముట్టడించారు. కార్మిక సంఘాల ఆధ్వర్యంలో 12వ రోజు సమ్మెలో భాగంగా పారిశుధ్య కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలని మున్సిపల్‌ కార్మికుల సమ్మె శిబిరం నుంచి ర్యాలీగా వెళ్లి మున్సిపల్‌ కార్యాలయాన్ని ముట్టడించారు. కార్యాలయం ముందు బైఠాయించి, మున్సిపల్‌ కార్యాలయంలోకి వెళ్లారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, పెద్దఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో మున్సిపల్‌ కార్యాలయం దద్దరిల్లింది. మున్సిపల్‌ కమిషనర్‌, పోలీసు యంత్రాంగం వచ్చి కార్మికులు బయటకు వెళ్లాలని చెప్పడంతో కార్మికులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కార్మిక నాయకులను బలవంతంగా అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా సిఐటియు పట్టణ కార్యదర్శి రాముడు, ఎఐటియుసి తాలూకా సహాయ కార్యదర్శి జి.రంగన్న, పిడిఎస్‌యు జిల్లా కార్యదర్శి మహేంద్ర మాట్లాడారు. మున్సిపల్‌ కార్మికులను రెగ్యులర్‌ చేసి, క్లాప్‌ ఆటో డ్రైవర్లకు జిఒ 7 ప్రకారం రూ.18,500 వేతనం, కార్మికులకు రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌, గ్రాట్యుటీ, కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం చర్చల పేరుతో కాలయాపన చేస్తూ కార్మిక హక్కులను కాలరాస్తోందన్నారు. ముఖ్యమంత్రి చర్చల్లో పాల్గొని చర్చలు సఫలం చేయాలని కోరారు. లేకపోతే దశలవారీగా సమ్మెను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నాయకులు వీరేష్‌, విజయేంద్ర, మున్సిపల్‌ నాయకులు ఎల్లప్ప, శివ, లక్ష్మణ్‌, నాగప్ప, అల్లా బకాష్‌, తిక్కయ్య, రంగస్వామి, కేశన్న, రవి, ఈరన్న, ప్రతాప్‌, ఆరిఫ్‌, దేవపుత్ర పాల్గొన్నారు.

➡️