పోలింగ్‌ కేంద్రాల్లో సౌకర్యాలు కరువు

ప్రజాశక్తి-యర్రగొండపాలెం: యర్రగొండపాలెం మండలంలో పోలింగ్‌ కేంద్రాల్లో కనీస సౌకర్యాలు కరువయ్యాయి. ఎన్నికల సంఘం ప్రతి పోలింగ్‌ కేంద్రంలో ఒక వీల్‌చైర్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అయినప్పటికీ అధికారులు ఆ ఏర్పాట్లు చేయకపోవడంతో వికలాంగులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సోమవారం జరిగిన ఎన్నికల సందర్భంగా మండలంలోని ఏ పోలింగ్‌ బూత్‌లోనూ వీల్‌చైర్‌ కనిపించలేదు. దీంతో వృద్ధులను, వికలాంగులను ఇద్దరు ముగ్గురు పట్టుకొని ఎత్తుకొని తీసుకువచ్చి ఓట్లు వేయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి తోడు కనీస సౌకర్యాలు లేవని తెలియడంతో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని మనసులో దృఢంగా ఉన్న వికలాంగులు, వృద్ధులు సైతం ఇబ్బంది ఎందుకులే అంటూ ఓటు వేయడమే మానుకున్నారు. కాగా కొందరు వృద్ధులు సైతం తమ బిడ్డల భవిష్యత్తు కోసం ఇబ్బంది పడైనా ఓటు వేయాల్సిందేనంటూ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరికొందరు నడవలేని నిస్సహాయ స్థితిలో ఉన్నా పలువురి సహాయంతో ఓటు హక్కు వినియోగించుకోవడం కనిపించింది. ఏది ఏమైనా యువత కంటే ఎక్కువగా వృద్ధులు, మహిళలు, వికలాంగులే ఎక్కువ మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్లు కనిపిస్తోంది.

➡️