కనిగిరిని అభివృద్ధి చేసుకుందాం: ఉగ్ర

ప్రజాశక్తి-కనిగిరి: వెనుకబడిన కనిగిరిని ఐక్యంగా అభివృద్ధి చేసుకుందామని కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్‌ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి తెలియజేశారు. గురువారం స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలో మున్సిపల్‌ ఎక్స్‌ అఫీషియో మెంబర్‌గా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. మున్సిపల్‌ చైర్మన్‌ షేక్‌ అబ్దుల్‌ గఫార్‌, ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రను సాదరంగా ఆహ్వానించి కౌన్సిలర్లను పరిచయం చేశారు. పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కనిగిరి మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రస్తుత కమిటీ ఐక్యంగా కృషి చేసిందని కొన్ని పనులు పెండింగ్లో ఉన్నాయని, వాటిని పూర్తి చేసేందుకు సహకారం అందించాలని ఎమ్మెల్యేను కోరారు. ఈ సందర్భంగా కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్‌ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి మాట్లాడుతూ తనకు పదవులపై కాంక్ష లేదని, తాను పుట్టిన వెనుకబడిన కనిగిరి ప్రాంతాన్ని ఎలాగైనా అభివృద్ధి చేయాలనే కాంక్షతో ఎన్నికల్లో పోటీ చేసినట్లు తెలిపారు. కనిగిరి నియోజకవర్గం నుంచి సుమారు 65,000 మంది ఇతర ప్రాంతాలకు వలసపోయినట్లు గుర్తించామని, అది చాలా బాధ వేసిందని తెలిపారు. గత పాలకులు 10 సంవత్సరాలుగా అభివృద్ధిపై దృష్టి సారించకపోవడం దురదృష్టకరమన్నారు. తన దృష్టి అంతా వెనుకబడిన కనిగిరిని అభివద్ధి చేయడం పైనే ఉంటుందన్నారు. కనిగిరి ఆదర్శ పాఠశాల విద్యార్థులు 10 సంవత్సరాలుగా పడుతున్న అవస్థలు తీర్చేందుకు ముందుగా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. నడికుడి, శ్రీకాళహస్తి రైల్వే లైన్‌ పనులు వేగవంతంగా సాగేలా కృషి చేస్తున్నానని తెలిపారు. వచ్చే ఏడాదికి త్రిబుల్‌ ఐటీ క్లాసులు కనిగిరిలో జరిగేలా కృషి చేస్తామని తెలిపారు. ఇంటింటికీ కుళాయిల ద్వారా సురక్షిత జలాలను అందిస్తామని అన్నారు. ఆక్రమణలు తొలగించి ట్రాఫిక్‌ సమస్య లేకుండా చేయడంతో పాటు ఉపాధి కోల్పోయిన వారికి ప్రత్యామ్నాయంగా ఉపాధి చూపిస్తామని, అందుకు వారు సహకరించాలని కోరారు. రాష్ట్ర మంత్రివర్గంతో తమకున్న పరిచయాలతో కనిగిరి ప్రాంతంలో పరిశ్రమలు స్థాపించేందుకు ఉపాధి కల్పించి వలసలు నివారించేందుకు పాటుపడతానని తెలిపారు. నిమ్జ్‌ ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. భూగర్భ జలాల అభివృద్ధికి, మౌలిక వసతుల కల్పనకు నిధులు మంజూరు చేయిస్తానని తెలిపారు. కీర్తిశేషులు మాజీ కేంద్రమంత్రి పులి వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఇరిగినేని తిరుపతినాయుడు కనిగిరి ప్రాంతానికి మంచి చేసినవారిగా ప్రజల మనసులో నిలిచారని అన్నారు. విద్యావ్యవస్థ అభ్యున్నతికి కృషి చేస్తామని అన్నారు. అనంతరం మున్సిపల్‌ కార్యాలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు. వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న మానవతా సంస్థ ప్రతినిధులను అభినందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ పులి శాంతి, మాణిక్యరావు, కౌన్సిలర్లు, మున్సిపల్‌ అధికారులు, సిబ్బంది, టిడిపి నాయకులు పాల్గొన్నారు.

➡️