చిన్నవర్షం పడితే చాలు అన్నవరం వాగు పై వరద ఉధృతి – 40 గ్రామాల రాకపోకలు బంద్‌

ప్రజాశక్తి-విఆర్‌.పురం (అల్లూరి) : మండలంలోని రాత్రి కురిసిన వర్షానికి గుట్టలలోనుండి వరద రావడంతో బ్రిడ్జిపై నుండి వరద పోటెత్తింది. మండలానికి, గ్రామాలకు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. రేఖపల్లి పంచాయతీ గల అన్నవరం గ్రామం, ఉమ్మడివరం గ్రామం, మధ్యలో గల బ్రిడ్జి కూలిపోవడంతో తాత్కాలంగా నిర్మించిన బ్రిడ్జి ఎత్తు తక్కువగా కట్టడంతో చిన్న వర్షం కురిసినా మండలానికి నాలపై గ్రామాల రాకపోకలు నిలిచిపోతాయి. ఆదివారం ఉమ్మడివరం గ్రామస్తులు మాట్లాడుతూ …. గత రెండు సంవత్సరాలుగా తాము పడుతున్న బాధలను చూసి అధికారులు ఎవరు పట్టించుకోవట్లేదు అని వర్షాకాలం వచ్చిందంటే తమ తిప్పలు దేవుడికే తెలుసని అన్నారు. మండలానికి రావాలంటే వేరే ప్రత్యామ్నాయం లేదని ఈ మార్గంలో నుండే ప్రజలు ప్రయాణం చేయాల్సి వస్తుందని అన్నారు. ఆస్పత్రికి బ్యాంకులకు నిత్యావసర సరుకులకు తహశీల్దార్‌ కార్యాలయానికి వెళ్లాలంటే ఇదే మార్గమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పడిపోయిన బ్రిడ్జి నిర్మించేంతవరకు ప్రజలకు అవసరాలు నిమిత్తం నాటు పడవ ఏర్పాటు చేయాలని వారు అధికారులను డిమాండ్‌ చేశారు. వర్షాలు మొదలవడంతో తమకు ఈ బాధలు తప్పేలా లేవని ఈ వాగుకి గుట్టలలో నుండి చెట్లతోపాటుగా వరద బీభత్సంగా వస్తుందని అన్నారు. గత సంవత్సరం వర్షాలకు వరదలకు ఈ బ్రిడ్జి ఒక సైడు కొట్టకుపోయిందన్నారు. దాన్ని తాత్కాలంగా మరమ్మతులు చేశారని ఇప్పుడు వరదలు వస్తే ఈ బ్రిడ్జి కూడా కొట్టకుపోయే ప్రమాదం ఉందని ప్రజలు ఆరోపిస్తున్నారు ప్రభుత్వం చొరవచూపి నాటు పడవ ఏర్పాటు చేయాలని నాలపై గ్రామ ప్రజలు అధికారులను వేడుకుంటున్నారు. గత ప్రభుత్వం ఈ బ్రిడ్జిపై ఎలాంటి చర్య తీసుకోలేదని ఈ ప్రభుత్వము అయినా గ్రామ ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని చొరవ చూపాలని గ్రామ ప్రజలు వేడుకుంటున్నారు.

➡️