విద్యుత్‌ ప్రమాద రహిత జిల్లాగా మారుద్దాం

ప్రజాశక్తి – కడప విద్యుత్‌ ప్రమాదాల బారిన పడకుండా ప్రతి ఒక్కరు తగు జాగ్రత్తలు పాటించాలని జిల్లా విద్యుత్‌ శాఖ అధికారి ఎస్‌. రమణ అన్నారు. విద్యుత్‌ ప్రమాదాలను అరికట్టేందుకు ప్రజల్లో అవగాహన కలిగించే విధంగా అవగాహన సదస్సులు నిర్వ హిస్తున్నట్లు చెప్పారు. జిల్లాను విద్యుత్‌ ప్రమాద రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరు తమ వంతు కషి చేయా లని చెప్పారు. బుధవారం విద్యుత్‌ భవన్‌ లోని తన ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యుత్‌ ప్రమాదాల నివారణస్త్ర లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పని చేయాలన్నారు. ఈదురుగాలులు, వర్షాల వల్ల తెగిపడిన విద్యుత్‌ వైర్‌ లకు దూరంగా ఉండి సంబంధిత అధికారులకు లేదా దగ్గరలోని ఉప కేంద్రాలలో ఉండే సిబ్బందికి తెలియజేసి వారి ద్వారా మరమ్మతుతులు చేయించుకోవాలి అని తెలిపారు. ఫిర్యాదు చేసేందుకు టోల్‌ ఫ్రీ నెంబర్‌ 1912 వినియోగించు కోవాలన్నారు. పొలాలలో తెగిపడిన విద్యుత్‌ లైను పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేశారు. విద్యుత్‌ ను సరైన పద్ధతిలో భద్రతా నియమాలు పాటించాలన్నారు. కాని విద్యుత్‌ పట్ల నిర్లక్ష్యం వహిస్తే ప్రమాదాలు తప్పవని హెచ్చరించారు. పొలాలలో ట్రాన్స్‌ఫార్మర్లకు కొంత స్థలం కేటా యించుకుని వాటి వద్దకు ఎవరు వెళ్ళవద్దని తెలియజేశారు. విద్యుత్‌ లైన్ల కింద బోర్లు వేయరాదని మరియు విద్యుత్‌ మోటార్‌ కు ట్రాన్స్ఫార్మర్లకు మధ్య 20 నుంచి 30 మీటర్లు దూరం ఉండేటట్లు ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. విద్యుత్‌ మోటార్ల స్విచ్‌ (స్టార్టర్‌) ఆన్‌ అండ్‌ ఆఫ్‌ చేసేటప్పుడు రైతులు విధిగా కాళ్లకు చెప్పులు, చేతికి రబ్బరు తొడుగు ధరించాలని చెప్పారు. ప్రమాణాలు కలిగిన విద్యుత్‌ వైర్లను, మోటార్లను, విద్యుత్‌ పరికరాలను వాడాలని తెలిపారు బహిరంగ ప్రదేశాలలో పంటపొలాలకు విద్యుత్‌ కంచెను ఏర్పాటు చేయడం చట్టరీత్యా నేరమని చెప్పారు. ఇటువంటి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇన్సులేషన్‌, రబ్బరు తొడుగు ఉన్న పనిముట్లను మాత్రమే విద్యుత్‌ మరమ్మతులకు ఉపయోగించాలని తెలిపారు. సూచనలు పాటించి విద్యుత్‌ ప్రమాద రహిత జిల్లాగా చేయాలని జిల్లా విద్యుత్‌ శాఖ అధికారి ఎస్‌. రమణ ఈ సందర్భంగా ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

➡️