అంగన్వాడీలపై ప్రభుత్వ తీరు గర్హనీయం : సిపిఎం

Jan 22,2024 20:51

పార్వతీపురంరూరల్‌ : అంగన్వాడీలపై జిల్లా కలెక్టర్‌, జిల్లా అధికార యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు సరైంది కాదని, ఈ దౌర్జన్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని సిపిఎం, ఐక్య వామపక్ష పార్టీల నాయకులు అన్నారు. ఈ మేరకు సోమవారం పార్వతీపురం -విశాఖపట్నం రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. అనంతరం కలెక్టర్‌ కార్యాలయంలో జెసి ఆర్‌.గోవిందరావును కలిసి వినతి అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ కార్మికులు 42 రోజులుగా చట్టబద్ధమైన సమ్మె చేస్తున్నారన్నారు. అంగన్వాడీల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని, ప్రధానమైన వేతనాల పెంపునకు ప్రభుత్వం ఆమోదించాలని కోరారు. శాంతియుతంగా సమ్మె చేస్తున్న అంగన్వాడీలపై ఒత్తిడి చేయడం ప్రభుత్వానికి భావ్యం కాదన్నారు. వెంటనే తమరు జోక్యం చేసుకొని వారి న్యాయబద్ధమైన, చట్టబద్ధమైన డిమాండ్లు పరిష్కరించి, వారిపై నిర్బంధం ఆపి రాష్ట్ర ప్రభుత్వం చర్చలు పిలిచి సమ్మె సమస్య పరిష్కరించాలని కోరారు. అంగన్వాడీలు న్యాయంగా, చట్టబద్దంగా సమ్మె నిర్వహిస్తున్నారని, నిబంధనల ప్రకారం 14 రోజులు ముందుగా సమ్మె నోటీస్‌ ఇచ్చిన తర్వాతే సమ్మె ప్రారంభమైందని తెలిపారు. అధికారులు ఇచ్చిన షోకాజ్‌ నోటీసులకు అంగన్వాడీలు వివరణ కూడా ఇచ్చారన్నారు. న్యాయంగా, చట్ట బద్దంగా దీనిపై బహిరంగ విదారణకు ప్రభుత్వం పూసుకోవాలని, అలా చేయకుండా తొలగింపు ఉత్తర్వులు ఇవ్వడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. కావున అంగన్వాడీలపై నిర్బంధం, తొలగింపు ఉత్తర్వులు ప్రభుత్వం ఆపాలని డిమాండ్‌ చేశారు. కావున వెంటనే బెదిరింపుల ఉత్తర్వులు ఉపసంహరించుకోవాలని, వారితో చర్చించే న్యాయమైన వారి సమస్యలు పరిష్కరించాలని, లేనిచో ఆందోళన తీవ్రతరం చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు, సిపిఐ, సిపిఎంఎల్‌, సిపిఎం ఎండి వామపక్ష, ప్రజా సంఘాలు నాయకులు బి.నర్సింగరావు, పి.భాస్కర రావు, పి.సంఘం, ఎన్‌ఎం నాయుడు, సిఐటియు నాయకులు వై.మన్మధరావు, జి.వెంకటరమణ, బివి రమణ, కె.రామస్వామి, బలరాం, బంటు దాసు, పాకల సన్యాసిరావు తదితర సంఘాలు నాయకులు పాల్గొన్నారు.సాలూరు: న్యాయమైన డిమాండ్లు ఆమోదించాలని కోరుతూ అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన సమ్మె లో భాగంగా చలో విజయవాడ కార్యక్రమం పై రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధాన్ని ఖండిస్తూ పట్టణ సిపిఎం నాయకులు సోమవారం జాతీయ రహదారిపై నిరసన వ్యక్తం చేశారు. సిపిఎం పట్టణ నాయకులు రాముడు, శంకరరావు ఆధ్వర్యాన కార్యకర్తలు ప్రభుత్వ తీరును ఖండించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల పట్ల మొదటి నుంచి అణిచివేత ధోరణి అవలంభిస్తోందని చెప్పారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను వైసిపి ప్రభుత్వం హరిస్తోందన్నారు. కార్యక్రమంలో పట్టణ నాయకులు పోలరాజు, రామారావు పాల్గొన్నారు.నిరాహార దీక్షా శిబిరంపై పోలీసుల నిరంకుశ దాడిని, అక్రమ అరెస్టులకు ఖండనపార్వతీపురం టౌన్‌ : సిఐటియు, ఎఐటియుసి, ఇఫ్టూ అనుబంధ అంగన్వాడీ సంఘాల అధ్వర్యంలో 41 రోజులుగా శాంతియుతంగా రాష్ట్రంలో సమ్మె సాగుతుందని, ఐదురోజులుగా నిరవధిక నిరాహార దీక్ష సాగుతున్నాయని, విజయవాడలో జరుగుతున్న ఈ శిబిరంపై పోలీసులు నిరంకుశంగా దాడి చేయడాన్ని ఖండిస్తున్నట్టు ఇఫ్తూ, ఎఐకెఎంఎస్‌, పిడబ్ల్యయు, ఎఐటిఎఫ్‌ జిల్లా నాయకులు జి.సర్వేశ్వరరావు, బొత్స నర్సింగరావు, పి.రమణి, ఎస్‌.జయలక్ష్మి పేర్కొన్నారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశాయి. విజయవాడలోని దీక్షా శిబిరానికి వేలాదిమంది అంగన్వాడీలు చేరుకున్నారని, వారిపై తెల్లవారు జామున 3 గంటల కాలంలో పోలీసులు వందల సంఖ్యలో మోహరించి, కరెంటు తొలగించి, అమానుషంగా దాడి చేయడం దారుణమన్నారు. దీక్షలో ఉన్న వారిని మానవత్వం లేకుండా, మహిళలనే విచక్షణ చూపకుండా అత్యంత దారుణంగా వ్యవహరించి లాగి పడేయడం దారుణమన్నారు. అంగన్వాడీలపై పోలీసులు సాగించిన ఈ పాశవిక దాడిని, ప్రభుత్వ నిర్బంధాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. సిపిఐఎంఎల్‌ ఖండనవీరఘట్టం: అంగన్వాడీ కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలని సమ్మె చేస్తుంటే మరోవైపు ప్రభుత్వం విధుల నుంచడం దారుణమని సిపిఐ ఎంఎల్‌ జిల్లా కార్యదర్శి పి.భాస్కరరావు ప్రభుత్వాన్ని విమర్శించారు. సోమవారం స్థానిక సిపిఐఎంఎల్‌ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చలో విజయవాడకు అంగన్వాడీ కార్యకర్తలను వెళ్లనీయకుండా పోలీసులు గృహనిర్బంధాలు, అరెస్టులు వంటివి చేయడం దారుణమన్నారు. జగన్మోహన్‌ రెడ్డి తన పాదయాత్రలు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆయన డిమాండ్‌ చేశారు. అంగన్వాడీ కార్యకర్తలకు అన్యాయం జరిగితే ఉద్యమ కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో ప్రగతిశీల జిల్లా కార్యదర్శి దుర్గా చూడమణి, సూర్యారావు, టి.నాగరాజు తదితరులు పాల్గొన్నారు.అక్రమ అరెస్టులకు నిరసనగా రాస్తారోకో కొమరాడ : సమస్యలు చెప్పుకొనేందుకు వెళ్తున్న అంగన్వాడీల అక్రమ అరెస్టులకు వ్యతిరేకంగా కొమరాడలో అంతర్‌ రాష్ట్ర రహదారిపై సోమవారం రాస్తారోకో చేపట్టారు. ఆదివారం అంగన్వాడీ సిబ్బంది, సిఐటియు నాయకులు అక్రమ అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని, అంగన్వాడీ సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని నాయకులు సాంబమూర్తి, అనురాధ, జ్యోతి డిమాండ్‌ చేశారు. కొమరాడ సిడిపిఒ సుగుణ కుమార్‌ సోమవారం 9.30గంట ల్లోపు విధుల్లో చేరకపోతే తొలగిస్తామని అంగన్‌వాడీ లను భయభ్రాంతులకు గురిచేయడం దారుణమ న్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటు జిల్లా స్థాయి అధికారు లు కక్ష సాధింపు చర్యలు మానుకొని అంగన్వాడీల న్యాయమైన కోర్కెలను పరిష్కరించే దిశగా ఆలోచించాలని, లేనిచో ఈ పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మండలం లోని పలువురు అంగన్‌వాడీలు పాల్గొన్నారు.

➡️