అంబేద్కర్‌ ఆశయాలకు అంకితమవుదాం : కలెక్టర్‌

Jan 19,2024 20:52

ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌  :  డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని కలెక్టరు నిశాంత్‌ కుమార్‌ తెలిపారు. శుక్రవారం స్థానిక గిరిమిత్ర భవనంలో సాంఘిక సంక్షేమ శాఖ ఏర్పాటు చేసిన సామాజిక సమతా సంకల్ప సభకు కలెక్టరు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విజయవాడలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన 125 అడుగుల డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ సామాజిక న్యాయ మహాశిల్పం విగ్రహ ఆవిష్కరణ సందర్బంగా జిల్లాలో సామాజిక సమతా సంకల్ప కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యకమంలో భాగంగా తొలుత సెయింట్‌ పీటర్స్‌ పాఠశాల నుంచి కలెక్టరేట్‌ వరకు మారథాన్‌, మానవహారం నిర్వహించారు. ప్రభుత్వాసుపత్రిలో వైద్య, ఆరోగ్యశాఖ వారిచే రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఉదయం 11 గంటల నుంచి ఐటిడిఎ గిరిమిత్ర సమావేశ మందిరం ప్రాంగణంలో జిల్లా సమాచార శాఖ ఏర్పాటు చేసిన డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ జీవిత చరిత్ర, ముఖ్య ఘట్టాలను తెలిపే ఛాయా చిత్ర ప్రదర్శనను కలెక్టర్‌ తిలకించారు. అనంతరం అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్లు అర్పించారు. అలాగే బిఆర్‌ అంబేద్కర్‌ జీవితంపై ప్రచురించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ అంబేద్కర్‌ రాజ్యాంగం ద్వారా అన్ని వర్గాల వారికి న్యాయం చేశారని, రాజ్యాంగ నిర్మాణంలో సామాజిక అసమానతల నిర్మూలన, సామాజిక అభివృద్ధినే కాకుండా ఆర్థిక అభివృద్ధికి కావాల్సిన అన్ని అంశాలను పొందుపర్చారని తెలిపారు. రాజ్యాంగం కల్పించిన స్త్రీలకు పురుషులతో సమానంగా ఆస్తిహక్కు, అన్ని కులాలవారికి గుడిలో ప్రవేశం, సమాన పనికి సమాన వేతనం హక్కు తదితర చట్టాల ఫలితాలను ప్రతి ఒక్కరూ పొందుతున్నారని తెలిపారు. మహిళలకు వివాహనంతరం ఎటువంటి భరోసా కల్పించాలో సూచించారని పేర్కొన్నారు. అంటరానితనం, కుల నిర్మూలనకు ఎంతో కృషి చేశారని, స్వాతంత్ర భారతదేశపు మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రిగా పని చేసిన ఘనత అంబేద్కర్‌కు దక్కిందని పేర్కొ న్నారు. సమాజంలో దళితుల హక్కుల కోసం, సామాజికంగా వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం పోరాడిన గొప్ప కార్యకర్త, సంఘ సంస్కర్త అంబేద్కర్‌ అని, దేశావ్యాప్తంగా అంబేద్కర్‌ చేసిన సేవలపై చర్చ జరగాల్సిన అవసరం ఎంతయినా ఉందని కలెక్టర్‌ అన్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని తెలిపారు. జెసి ఆర్‌.గోవిందరావు మాట్లాడుత%

➡️