ఆటోనగర్‌లో భారీ అగ్ని ప్రమాదం

May 6,2024 00:51

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : గుంటూరు ఆటోనగర్‌లో ఆదివారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దాదాపు రిపేరుకు వచ్చిన 70 కార్లు, దుకాణాలు, ఇతర సామాగ్రి అగ్నికి ఆహుతి అయ్యాయి. ఈ వాహనాలన్నీ దాదాపుగా విడివిడిగా స్పేరు పార్టులుగా మార్చి విక్రయించేందుకు ఇక్కడికి వచ్చినట్టు సమాచారం. నష్టం దాదాపు రూ.10 లక్షల వరకు ఉంటుందని అగ్నిమాపక శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నామన్నారు. లేదా వేసవి తీవ్రత వల్ల వ్యర్ధపదార్ధాలతో నిర్లక్ష్యంగా వేసిన నిప్పు వల్ల ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ఆటోనగర్‌లో రెండ్రోజులుగా వ్యాపారులు, కార్మికులు, ఇతర వర్గాలతో టిడిపి, వైసిపి నాయకులు వేర్వేరుగా ఆత్మీయ భేటిలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఈ ప్రమాదం జరగడం రాజకీయ దుమారానికి దారితీసింది. ప్రమాదం జరిగిన ప్రాంతాలను టిడిపి వైసిపి నాయకులు ఆదివారం సాయంత్రం సందర్శించారు. బాధితులను ఓదార్చారు. టిడిపి లోక్‌సభ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌, తూర్పు నియోజకవర్గం టిడిపి అభ్యర్థి మహమ్మద్‌ నసీర్‌తో కలిసి ఘటనా స్థలికి వెళ్లి పరిశీలించారు. శుక్రవారం తాము ఆటోనగర్‌ వాసులు, వ్యాపారులతో సమావేశం అయ్యామని, శనివారం ఎమ్మెల్యే ముస్తాఫా, కిలారి రోశయ్య వచ్చి సమావేశం పెట్టారని వారికి సానుకూలత రాకపోవడంతో ఈ దురాగతానికి పాల్పడ్డారని డాక్టర్‌ పెమ్మసాని చంద్రశేఖర్‌ ఆరోపించారు. ఆటోనగర్లో పలువురు టిడిపి ముస్లిమ్‌ నాయకులకు చెందిన షాపులు దగ్దమయ్యాయన్నారు. ఈ ప్రమాదంలో 70 కార్లు, పలు దుకాణాలు పూర్తిగా కాలిపోయాయని బాధితులు ఈ సందర్భంగా వివరించారు. ఘటనను ప్రమాదంగా చిత్రీకరించాలని కొందరు ప్రయత్నించినా ఉద్దేశపూర్వకంగా జరిగిన పనే అని బాధితులు ఆరోపించారని తెలిపారు. అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడుతూ అర కిలోమీటర్‌ దూరంలో ఉన్న రెండు షాపులు అగ్ని ప్రమాదంలో ఎలా దగ్ధమవుతాయి? అని ప్రశ్నించారు. అవి కూడా టిడిపి నాయకులకు చెందిన షాపులు మాత్రమే ప్రమాదానికి గురవుతాయా? అని నిలదీశారు. జరిగిన ఘటనపై ఐ.జి కి ఫిర్యాదు చేశానన్నారు. అయితే టిడిపి నాయకుల ఆరోపణలను వైసిపి తూర్పు నియోజకవర్గం అభ్యర్థి నూరిఫాతిమా ఖండించారు. తప్పుడు ఆరోపణలు చేయడం తగదన్నారు. ఘటన స్థలాన్ని ఆమె సందర్శించారు. అగ్ని ప్రమాదంపై విచారణ చేయాలన్నారు.

➡️