కూలీలకు కనీస వసతులు కల్పించాలి

ప్రజాశక్తి-శింగరాయకొండ : ఉపాధి పనులు చేస్తున్న కూలీలకు పని ప్రదేశంలో కనీస వసతులు కల్పించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కంకణాల ఆంజనేయులు డిమాండ్‌ చేశారు. టంగుటూరు మండలం బాపూజీ కాలనీ, రాయవారిపాలెం చెరువు తదితర ప్రాంతాల్లో నిర్వహిస్తున్న ఉపాధి పనులను వ్యవసాయ కార్మిక సంఘం బందం బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించింది. ఈ సందర్భంగా కూలీలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఎండలు ఎక్కువగా ఉన్నాయని తమకు మజ్జిగ, మంచినీళ్లు, ఒఆర్‌ఎస్‌ ప్యాకెట్లు పంపిణీ చేయాలని కూలీలు కోరారు. పనిప్రదేశంలో కూలీలకు టెంట్లు ఏర్పాటు చేసి మెడికల్‌ కిట్లు అందుబాటులో ఉంచాలన్నారు. ప్రభుత్వం రోజూ వారీ వేతనం రూ.300 ప్రకటించగా తమకు రూ.220 మాత్రమే గిట్టుబాటు అవుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కంకణాల ఆంజనేయులు మాట్లాడుతూ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనం రూ.600 పెంచాలని వ్యవసాయ కార్మిక సంఘం ప్రభుత్వాల ముందు డిమాండ్‌ పెట్టినట్లు తెలిపారు. పని ప్రదేశంలో మౌలిక వసతులు కల్పిస్తామని ప్రభుత్వాలు చెప్పినా ఆచరణలో అమలు జరగటం లేదన్నారు. సమస్యలను అధికారుల దష్టికి తీసుకెళ్తామన్నారు. వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పుల ఫలితంగా గ్రామీణ పేదలకు పని దినాలు క్రమంగా తగ్గిపోతున్నట్లు తెలిపారు. పట్టణాలకు వలస పోయినా భవన నిర్మాణ పనులు కూడా తగినంతగా లేవన్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం అధికారంలోకి రానున్న ప్రభుత్వాలు ఉపాధి హామీ చట్టానికి నిధులు పెంచి పేదలను ఆదుకోవాలన్నారు. అదే విధంగా ఉపాధి పనుల పరిశీలనకు ఏపీడీ వెంకటస్వామి, ఎపిఒ సుభాషిణి వచ్చారు. వ్యవసాయ కార్మిక సంఘం బందం కూలీల సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం నిర్ణయించిన మౌలిక వసతులన్ని కల్పిస్తామని, రోజు వారీ వేతనం రూ.300 వచ్చేలా ప్రయత్నం చేస్తామని వారు సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి టంగుటూరి రాము, కెవిపిఎస్‌ జిల్లా ఉపాధ్యక్షుడు వి.మోజస్‌, ఉపాధి కూలీలు పాల్గొన్నారు.హనుమంతునిపాడు : ఉపాధి కూలీలకు పని ప్రదేశాలలో మౌలిక వసతులు కల్పించాలని ఎపి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బడుగు వెంకటేశ్వర్లు డిమాండ్‌ చేశారు మండల పరిధిలోని నీలకంఠాపురం, వేంగపల్లి గ్రామాల్లో నిర్వహిస్తున్న ఉపాధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా బడుగు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు దుర్మార్గపు ఆలోచన చేస్తుందన్నారు పని ప్రదేశాలలో టెంట్లు, మంచినీళ్లు మజ్జిగ, మెడికల్‌ కిట్లు అందుబాటులో ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధి కూలీల సంఘం నాయకులు కోడలి వెంకటేశ్వర్లు, ఆదెయ్య, సాంబశివ, ఏడుకొండలు, బాల చెన్నయ్య,రవీంద్ర,శ్రీను,చిన్న తదితరులు పాల్గొన్నారు.

➡️