ఎన్నికల నిర్వహణకు పర్యవేక్షణ కీలకం

ప్రజాశక్తి-ఒంగోలు కలెక్టరేట్‌: ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడానికి పకడ్బందీ ఏర్పాట్లు, సమగ్ర పర్యవేక్షణ కీలకమని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి ఏఎస్‌ దినేష్‌కుమార్‌ అన్నారు. బుధవారం ఆయన ప్రకాశం భవనం నుంచి అన్ని నియోజకవర్గాల రిటర్నింగ్‌ ఆఫీసర్లు, ఏఆర్‌ఒలు, ఎంపిడిఒలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. స్థానిక పరిస్థితులు, పోలింగ్‌ కేంద్రాల్లో మౌలిక సౌకర్యాలు, ఎన్నికల సిబ్బందికి వసతులు వంటి అంశాలపై ఆయన ఆరాతీసి అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా దినేష్‌కుమార్‌ మాట్లాడుతూ పోలింగ్‌ కేంద్రాల్లోకి ఓటర్ల రాకపోకలను క్రమబద్ధీకరించేలా బారికేడ్లు, లైటింగ్‌, మైక్‌ సిస్టమ్‌, ఒకే ప్రాంతంలో ఒకటి కంటే ఎక్కువ పోలింగ్‌ కేంద్రాలు ఉంటే ఓటర్లకు సహాయపడేలా హెల్ప్‌ డెస్క్‌, వైద్యశిబిరం, తాగునీరు, వాహనాలకు పార్కింగ్‌ సదుపాయం వంటి విషయాలలో ఎలాంటి లోపం లేకుండా చూసుకోవాలని స్పష్టం చేశారు. పోలింగ్‌ కేంద్రాల సమీపంలో ఇటుకలు, కర్రలు, భవన నిర్మాణాలకు వినియోగించే ఎలాంటి సామగ్రి లేకుండా చూడాలని కలెక్టర్‌ ఆదేశించారు. పోలింగ్‌ కేంద్రం, పరిసరాలు మొత్తం కవర్‌ అయ్యేలా సిసి టివిలు ఏర్పాటు చేయడంలో ఎటువంటి నిర్లక్ష్యం ఉండకూడదన్నారు. ఎన్నికల ప్రచారం పూర్తయిన తరువాత స్థానికేతరులెవరూ ఆయా ప్రాంతాలలో ఉండకుండా చూడాలని కలెక్టర్‌ ఆదేశించారు. సత్వరమే సమాచారం పంచుకునేలా ఆయా పోలింగ్‌ కేంద్రాల పరిధిలో పనిచేసే సిబ్బంది అందరితో ప్రత్యేకంగా వాట్సప్‌ గ్రూప్‌ ఏర్పాటు చేయాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో సంయుక్త కలెక్టర్‌ ఆర్‌ గోపాలకృష్ణ, డిఆర్‌ఒ ఆర్‌ శ్రీలత, ఇతర అధికారులు పాల్గొన్నారు.

➡️