మున్సిపల్‌ కార్మికులకు బకాయి జీతాలు చెల్లించాలి : మున్సిపల్‌ వర్కర్స్‌

Apr 13,2024 14:08 #municipal workers, #Protest, #salary

ప్రజాశక్తి -నెల్లూరు : మున్సిపల్‌ కార్మికులకు మార్చి నెల వేతనం, పెండింగ్‌ లో ఉన్న హెల్త్‌ అలవెన్స్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఏఓ కీ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్‌ జిల్లా కార్యదర్శి కే.పెంచల నరసయ్య మాట్లాడుతూ … మున్సిపల్‌ కార్మికులకు మార్చి నెల వేతనము నేటి వరకు జిల్లాలో ఎక్కడ ఇవ్వలేదన్నారు. ఆత్మకూరు, కావలి మున్సిపాలిటీలలో గత రెండు నెలల నుండి జీతాలు ఇవ్వలేదన్నారు. అదేవిధంగా సంక్రాంతి కానుక వెయ్యి రూపాయలు ఇవ్వాలని ఉన్న ఏ మున్సిపాలిటీలో అందలేదన్నారు. దినసరి కూలీలుగా పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు కావలి మున్సిపాలిటీలో మూడు నెలల నుండి జీతాలు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. నగరపాలక సంస్థ తో పాటు జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలలో మార్చి నెల బకాయి జీతం వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. మున్సిపల్‌ కార్మికులుగా పనిచేస్తున్న వారంతా దళిత, గిరిజన కుటుంబాలకు చెందిన నిరుపేదలు. జీతాలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే బకాయి జీతాలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు కామాక్షమ్మ, నెల్లూరు నగర, రూరల్‌ కార్యదర్శులు అశోక్‌, దేశ మూర్తి, కొండమ్మ, భాగ్యమ్మ, లోకేష్‌, శీను, రవీంద్ర, సలోమి తదితరులు పాల్గొన్నారు.

➡️