ఊసే లేని హామీలు

Mar 28,2024 21:42

బహిరంగ సభలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి

ఊసే లేని హామీలు
– నంద్యాల జిల్లాలో మేమంతా సిద్ధం బస్సు యాత్ర
– వైసిపి అభ్యర్థులను గెలిపించండి
– ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి
ప్రజాశక్తి – నంద్యాల కలెక్టరేట్‌
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మేమంతా సిద్ధం పేరుతో ఆయన చేప్పట్టిన బస్సు యాత్ర రెండో రోజు నంద్యాల జిల్లాలో సాగింది. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో గురువారం బస్సు యాత్ర ప్రారంభమైంది. సిరివెళ్ల మండలం ఎర్రగుంట్లలో గ్రామస్తులతో జగన్‌ ముఖాముఖి నిర్వహించారు. గ్రామానికి వైసిపి ప్రభుత్వం చేసిన వాటి గురించి ప్రజలకు వివరించారు. అనంతరం యాత్ర నంద్యాలకు చేరుకుంది. నంద్యాల డిగ్రీ కళాశాల మైదానంలో మేమంతా సిద్ధం బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో జగన్‌ జిల్లాకు ఎలాంటి హామీల ఊసు ఎత్తలేదు. నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి చంద్ర కిషోర్‌ రెడ్డి నంద్యాలను మున్సిపల్‌ కార్పొరేషన్‌ చేయాలని, నంద్యాల అర్బన్‌ డెవలప్మెంట్‌ అథారిటీ ఏర్పాటు చేయాలని, రింగ్‌ రోడ్డు ఇవ్వాలని ప్రతిపాదించినా జగన్‌ వాటి ప్రస్తావన తీసుకురాలేదు. నంద్యాల జిల్లాలో వైసిపి ఎంపీ అభ్యర్థితో పాటు 7 అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులను గెలిపించాలని సిఎం జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ఐదేళ్లలో వైసిపి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. వైసిపి ప్రభుత్వం వచ్చాక అనేక విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చినట్లు తెలిపారు. సచివాలయ వ్యవస్థ, నాడు-నేడు కింద పాఠశాలలు, ఆసుపత్రుల రూపురేఖలు మార్చామని, సచివాలయ వ్యవస్థ ద్వారా అనేక మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించామని పేర్కొన్నారు. సభకు వచ్చిన జన సమూహాన్ని చూస్తుంటే నంద్యాల జిల్లా సముద్రంలా ఎన్నికలకు సిద్ధం అంటుందని జగన్‌ మోహన్‌ రెడ్డి వ్యాఖ్యనించారు. 2014లో చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని మళ్లీ ఇప్పుడు నారా వారి పాలన మళ్లీ తెస్తామంటే ఒప్పుకోమని నంద్యాల నుండి ఏలూరు వరకు, కుప్పం నుండి ఇచ్చాపురం వరకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఒక్క జగన్‌ను ఎదుర్కోవడానికి చంద్రబాబు, దత్త పుత్రుడు, బిజెపి, ఎల్లోమీడియా తోడేళ్లన్నీ ఒక్కటయ్యాయని, వీరందరిని అడ్డుకునేందుకు మీరంతా సిద్దమేనా అంటూ నాయకులను, కార్యకర్తలకు దిశ, నిర్దేశం చేశారు. వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేసి నంద్యాల జిల్లాలోని ఎంపీ అభ్యర్థి పోచా బ్రహ్మానందరెడ్డితో పాటు నంద్యాల, పాణ్యం, బనగానపల్లె, డోన్‌, ఆళ్లగడ్డ, నందికొట్కూరు, శ్రీశైలం అసెంబ్లీ అభ్యర్థులు శిల్పా రవి చంద్ర కిషోర్‌ రెడ్డి, కాటసాని రాంభూపాల్‌ రెడ్డి, కాటసాని రామిరెడ్డి, బుగ్గన రాజేంద్ర నాథ్‌ రెడ్డి, గంగుల బిజేంద్రారెడ్డి, దార సుధీర్‌, శిల్పా చక్రపాణి రెడ్దిలను ఆశీర్వదించి గెలిపించాలని నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు పిలుపునిచ్చారు. అంతకు ముందు నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి మాట్లాడుతూ నంద్యాల అభివృద్ధి వైసిపి ప్రభుత్వంలోనే జరిగిందన్నారు. మా వెనుక జగనన్న అనే కటౌట్‌ ఉందని, అందుకే ఇంత ధీమాగా, దైర్యంగా ఉన్నామన్నారు. మళ్లీ ఏపికి జగనన్నే సిఎం అవుతారన్నారు. తన రాజకీయ ప్రత్యర్థి టిడిపి తరపున పోటీ చేస్తున్న ఫరూక్‌ గత 15 ఏళ్లుగా అనేక మంత్రి పదవులు అనుభవించారని, నంద్యాలకు ఏమి చేశారో చెప్పాలన్నారు. టిడిపి నాయకులు నియోజకవర్గం అభివృద్ధికి చేసింది శూన్యమన్నారు. అనంతరం సిద్ధం బస్సు యాత్ర నంద్యాల నుండి బయలు దేరి పాణ్యం మీదుగా కర్నూలు జిల్లా నాగలాపురం చేరుకుని జగన్‌ బస చేశారు. బహిరంగ సభలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం, ఎమ్మెల్సీ ఇసాక్‌ బాషా, జలవనరుల శాఖ సలహాదారు గంగుల ప్రతాప్‌ రెడ్డి, మహిళా కమిషన్‌ మాజీ చైర్మెన్‌ వాసిరెడ్డి పద్మ, శాప్‌ చైర్మెన్‌ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి, ఎమ్మెల్యేలు, వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థులు పాల్గొన్నారు.

➡️