ముకుందాపురంలో నీటి కష్టాలు..

Mar 27,2024 16:49

తోపుడు బండిపై పంట పొలాల నుంచి తాగునీరు తెచ్చుకుంటున్న యువకులు

ముకుందాపురంలో నీటి కష్టాలు..
– వారం రోజుల నుంచి నిలిచిన సరఫరా
– ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టని అధికారులు
– వ్యవసాయ బోర్ల నుండి నీరు తెచ్చుకుంటున్న గ్రామస్తులు
ప్రజాశక్తి – రుద్రవరం
వేసవిలో తాగునీటికి ఇబ్బంది రాకుండా ముందస్తు చర్యలు చేపట్టి ప్రజల దాహార్తిని తీర్చేందుకు అధికారులు చర్యలు చేపట్టాల్సి ఉంది. అయితే పంచాయతీ అధికారులు ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి కష్టాలను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తప్పడం లేదు. రుద్రవరం మండలం ముకుందాపురం గ్రామంలో ప్రజలు గుక్కెడు నీళ్ల కోసం కిలోమీటర్లు దూరం వెళ్లి పంట పొలాల్లో ఉన్న బోరు బావుల నుండి బిందెలతో నీళ్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితులు నెలకొంది. రుద్రవరం మండలం ముకుందాపురం గ్రామంలో దాదాపు 200 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ఈ కుటుంబాలకు తాగునీటి సౌకర్యం కోసం రక్షిత మంచినీటి సరఫరా ట్యాంకును ఏర్పాటు చేసి అధికారులు నీటి సరఫరా చేస్తున్నారు. అయితే గత వారం రోజుల నుంచి రక్షిత మంచినీటి సరఫరా ట్యాంకుకు నీరు అందడం లేదు. రక్షిత మంచినీటి ట్యాంకు కోసం వేసిన బోరులో భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో తాగునీరు ట్యాంకుకు సరఫరా కావడం లేదు. ఫలితంగా గ్రామంలో తాగునీటి కష్టాలు నెలకొన్నాయి. గ్రామంలో ఎక్కడా తాగునీటి సరఫరా లేకపోవడంతో గ్రామస్తులు పంట పొలాల్లో ఉన్న వ్యవసాయ బోరు బావుల దగ్గరకు ట్రాక్టర్లు, మోటార్‌ సైకిళ్ళు, తోపుడు బండ్లపై వెళ్లి బిందెలతో నీటిని తెచ్చుకుంటున్న పరిస్థితి ఏర్పడింది. పంట పొలాల్లో కూడా విద్యుత్‌ సరఫరా ఉన్న సమయంలో మాత్రమే నీళ్లు తెచ్చుకోవడానికి వీలవుతుంది. విద్యుత్‌ సరఫరా లేకపోతే వ్యవసాయ బోర్ల వద్ద కూడా నీటి కోసం పడిగాపులు కాయాల్సిందే. నీళ్లు తెచ్చుకోవడానికి విద్యుత్‌ లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని గ్రామానికి చెందిన లక్ష్మయ్య, రవి, ప్రసాద్‌, కార్తీక్‌, వంశీ, జానీ, మరియమ్మ, లక్ష్మీదేవి తదితరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ అధికారులు తాగునీటి కోసం ప్రజలు కష్టాలు పడుతున్నా సమస్య పరిష్కారం కోసం అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని ఆరోపిస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
హరినగరం సమ్మర్‌ స్టోరేజ్‌ నుంచి తాగునీటి సౌకర్యం కల్పిస్తాం
ఆర్డబ్ల్యూఎస్‌ ఏఈ ప్రమోద్‌
ముకుందాపురం గ్రామంలో భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో ప్రజలు తాగునీటికి ఇబ్బంది పడుతున్నారు. ప్రజలకు తాగునీటి సమస్య లేకుండా ఉండేందుకు హరినగరం సమ్మర్‌ స్టోరేజ్‌ నుంచి పైపులైన్‌ ద్వారా నీటి సౌకర్యం కల్పిస్తాం.

➡️