ఉద్యోగులకు వల

May 7,2024 21:41

పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల కోసం అభ్యర్థుల పాట్లు

పార్వతీపురంలో నగదు పంపిణీ

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌/పార్వతీపురం రూరల్‌  : సార్వత్రిక ఎన్నికల్లో ఉద్యోగుల ఓట్లు తీవ్ర ప్రభావం చూపనున్న నేపథ్యంలో వారి ఓట్లు ఎలాగైనా పొందేందుకు వైసిపి, టిడిపి అభ్యర్థులు నానా పాట్లు పడుతున్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌ పోలింగ్‌ ప్రారంభం కావడంతో ఉద్యోగులకు వల వేస్తున్నారు. ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, కాంట్రాక్టు సిబ్బందికి, అంగన్‌వాడీలకు ఓటు హక్కును ముందుగానే వినియోగించుకు అవకాశాన్ని కల్పించడంతో జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లోనూ ఈనెల 5 నుంచి పోస్టల్‌ బ్యాలెట్‌ పోలింగ్‌ ప్రారంభమైంది. ఉద్యోగులకు వేసేందుకు వైసిపి, టిడిపి అభ్యర్థులు తొలి నుంచీ ప్రయత్నాలు ప్రారంభించారు. ఆత్మీయ సమావేశాలు పేరిట పార్టీలు ఏర్పాటు చేసిన పార్టీలు తాజాగా డబ్బులు ఎర చూపుతున్నాయి. అధికార వైసిపి నాయకులు తమ పార్టీకి ఓటు వేయాలని ఉద్యోగులకు డబ్బులు ఆశ చూపుతున్నారు. అయితే చాలా మంది ఉద్యోగులు తిరస్కరిస్తున్నట్లు తెలిసింది. పార్వతీపురం నియోజకవర్గంలో 1751మంది ఓటర్లు ఉన్నారు. వీరు కాకుండా అంగన్‌వాడీలను, కాంట్రాక్టు ఉద్యోగులకు కూడా పోస్టల్‌ బ్యాలెట్‌ లభించింది. వీరిని లక్ష్యంగా చేసుకున్న అధికార వైసిపి నాయకులు డబ్బులతో ప్రలోభాలకు గురి చేస్తున్నారు. ఎన్నికల్లో పాల్గొనే వారి జాబితాను ముందుగానే సేకరించి వారిని తమ అనుయాయులతో ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ మాట్లాడి ఒక్కో ఓటుకు రూ.2వేలు నుంచి, రూ.5వేలు వరకూ అందజేస్తున్నట్లు సమాచారం. పార్వతీపురం, సీతానగరం మండలంలోని కొందరు అంగన్‌వాడీలకు, కాంట్రాక్టు ఉద్యోగులకు నగదు ఎర చూపగా, వారు తిరస్కరించినట్టు తెలిసింది. బలిజిపేట మండలంలో స్థానిక నాయకుల ఒత్తిళ్లు మేరకు నగదు తీసుకున్నట్లు సమాచారం. ఉద్యోగ భద్రత, సరైన ఆదాయం కూడా కలిగిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు కొందరు నగదు ప్రభావానికి లోనైట్లు సమాచారం. పార్వతీపురం మున్సిపాలిటీలో కొందరికి ఫోన్లలో నగదు బదిలీ జరిగినట్లు తెలుస్తుంది. తక్షణ అవసరాల నిమిత్తం, స్థానిక పరిస్ధితుల ప్రభావంతో కొంతమంది నగదు ప్రభావానికి లోనైనప్పటికీ, ఓటింగ్‌ మాత్రం తమ ఇష్టప్రకారమే వేసినట్లు చెపుతున్నారు. అభ్యర్ధుల గెలుపు, ఓటములపై అంతగా ప్రభావం చూపని పోస్టల్‌ బ్యాలెట్‌ విషయంలోనే ఇంతగా కాసులు కురిపిస్తే, వారంరోజుల్లో జరిగే సాధారణ ఎన్నికల్లో ధనం ఎంతగా ప్రవహించనున్నదోనన్న చర్చ జరుగుతోంది.

విజయనగరంలోని జెఎన్‌టియు కేంద్రంలో జరిగిన ఓటింగ్‌ మొదటి రోజు నుంచి అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉద్యోగులు ఓట్లు వేస్తున్నారంటూ ప్రచారం సాగింది. ఈనేపథ్యంలో వైసిపి నాయకులు ఉద్యోగుల ఫోన్‌ నెంబర్‌ తీసుకొని ఫోన్‌ పే ద్వారా డబ్బులు వేస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లా మొత్తంగా 18,631 పోస్టల్‌ బాలెట్లు ఓట్లు ఉండగా, ఒక్క విజయనగరం నియోజకవర్గంలోనే 3975 మంది ఓటర్లు ఉన్నారు. వైసిపి, టిడిపి మధ్య హోరా హోరీ పోటీజరుగుతున్న విజయనగరంలో పోస్టల్‌ బ్యాలెట్‌ఓట్లు కీలకంగా మారనున్నాయి. ఈ నేపథ్యంలో అభ్యర్థులు ఉద్యోగులకు డబ్బులు ఎర వేస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే సుమారుగా 70 శాతం ఓటింగ్‌ జరిగింది. ఇంకా రెండు రోజులు ఓటింగ్‌ కు అవకాశం ఉంది. అంగన్‌వాడీ వర్కర్లను కూడా ఒపిఒలుగా నియమించడంతో వారికి కూడా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటు వేసేందుకు అవకాశం వచ్చింది. వారి ఇళ్లకు వెళ్లి ఓటు వేయించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఉద్యోగులు డబ్బులు తీసుకోకపోతే వారికి బాగా పరిచయం ఉన్న వ్యక్తుల ద్వారా డిన్నర్‌ వంటి పార్టీలకు పీల్చి ప్రసన్నం చేసుకుంటున్నారు. పోలింగ్‌ కేంద్రం వద్దకు ఓటు వేసేందుకు వస్తున్న ఉద్యోగులను మద్య తోవలో వారి ఫోన్‌ నెంబర్‌ అడగడం, వాటర్‌ బాటిల్స్‌, కూల్‌ డ్రింక్స్‌ ఇవ్వడం, ఓటు వేయండి మీ ఫోన్‌పే కు డబ్బులు పడతాయని చెప్పడం వంటి దృశ్యాలు జెఎన్‌టియు సమీపంలో కనిపించాయి.

➡️