ప్రజా స్వామ్యానికి బలం ఎన్నికలే : ఎన్‌జిఒ

May 10,2024 22:01

ప్రజాశక్తి – విజయవాడ అర్బన్‌ : జిల్లాలోని ఉపాధ్యాయ, ఉద్యోగ, పెన్షన్‌దారుల కుటుంబ సభ్యులు తమ తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకునేలా ఎన్జీవో సంఘం కార్యవర్గం చొరవ తీసుకోవాలని జిల్లా అధ్యక్షులు ఎ.విద్యాసాగర్‌ అన్నారు. గాంధీనగర్‌లోని ఎన్జీవో హోం జిల్లా కార్యాలయంలో శుక్రవారం జరిగిన కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల విధులను ఉద్యోగులకి 13వ తారీకు స్పెషల్‌ క్యాజువల్‌ ఇచ్చే సౌకర్యాన్ని కలిగించారని, కానీ వేరువేరు ప్రాంతాల్లో ఎన్నికలు చేస్తున్న ఉద్యోగులు 13వ తారీఖున ఎన్నికలు ముగించుకుని మొత్తం సామాగ్రిని చేరవేసి సంబంధిత కార్యక్రమాన్ని ముగించుకునేసరికి 14వ తారీకు అవుతుందని 14వ తారీకు అధికారులు ఏ పరిస్థితుల్లోనూ వివిధ జిల్లాల్లో ఉన్న తమ ఆఫీసులకు హాజరయ్యే పరిస్థితి లేదనీ, అందుకని వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని 14వ తారీకు ఉద్యోగులకు స్పెషల్‌ క్యాజువల్‌ లీవ్‌ సౌకర్యం కల్పించాలని ఎన్నికల సంఘాన్ని కోరామని తెలిపారు. మెడికల్‌ డిపార్ట్మెంట్‌, ఇతర డిపార్ట్మెంట్‌ ఉద్యోగుల్ని ఎమర్జెన్సీ సర్వీసెస్‌ కి, అంబులెన్స్‌ సర్వీసెస్‌ కి, ఫస్ట్‌ ఎయిడ్‌ సర్వీసెస్‌ కి, ఎన్నికల విధులకు సంబంధించిన బాధ్యతలు అప్పగించిన దష్ట్యా మిగిలిన సిబ్బందితో పాటు వారికి కూడా ఎన్నికల విధులకు సంబంధించిన రెమ్యూనరేషన్‌ను చెల్లించాలని కూడా రాష్ట్ర ఎన్జీవో సంఘం నాయకులతో కలిసి ఎన్నికల సంఘం అధికారులకు వినతి పత్రాన్ని అందించామన్నారు. అనేక వేల మంది ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యం లేక ఓటు హక్కు నమోదు చేసుకోలేదని, అటువంటి వారి కోసం 13వ తారీకు తర్వాత వారందరికీ ఒక స్పెషల్‌ డ్రైవ్‌గా పోస్టల్‌ బ్యాలెట్‌ వేసుకునే సౌకర్యాన్ని కల్పించాల్సిందిగా ఎన్నికల సంఘానికి రాష్ట్ర నాయకులు విజ్ఞప్తి చేసినట్లు వివరించారు. కార్యదర్శి ఎండి ఇక్బాల్‌ మాట్లాడుతూ ఏ ప్రభుత్వంతోనైనా ఉద్యోగ సంఘాలు పోరాటాల ద్వారానే మన హక్కులను సాధించుకోగలమన్నారు. సమావేశంలో జిల్లా నాయకులు పి.రమేష్‌, రాజబాబు, బి.సతీష్‌ కుమార్‌, డి.విశ్వనాథ్‌, నాగేంద్ర బి.వి.రమణ, రామకృష్ణ శ్రీరామ్‌, మహిళా విభాగం నాయకురాలు శివలీల విజయశ్రీ తాలుకా యూనిట్ల కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

➡️