విజయవాడ బస్టాండ్‌ కిటకిట

May 12,2024 17:39
  • గంటల తరబడి ప్రయాణీకులు పడిగాపులు
  • అదనపు బస్సులు ఏర్పాటు చేసినా కొనసాగుతున్న రద్దీ

ప్రజాశక్తి – విజయవాడ : మే 13 న సార్వత్రిక ఎన్నికల నేపధ్యంలో ఓటర్లు తమ స్వస్థలాలకు ప్రయాణం కట్టడంతో ఆదివారం విజయవాడ బస్టాండ్‌ కిటకిటలాడుతోంది. ముఖ్యంగా హైదరాబాద్‌ నుండి విజయవాడకు వచ్చే ప్రయాణీకులతో బస్టాండ్‌లో తీవ్ర రద్దీ ఏర్పడింది. ఓట్ల పండుగ కోసం పోటెత్తిన వారితో బస్టాండ్‌ నిండిపోవడంతో ఆర్‌టిసి యాజమాన్యం చేతులెత్తేసింది. కొన్ని ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిప్పటికీ రద్దీకి అనుగుణంగా సర్వీసులు లేకపోవడంతో ప్రయాణీకుల బస్టాండ్‌లోనే గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. విశాఖ, రాజమండ్రి, ఉత్తరాంధ్ర, రాయలసీమకు వెళ్లే ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రయాణీకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎపిఎస్‌ఆర్‌టిసి ఇప్పటికే ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతున్న ఆర్‌టిసి ఎమ్‌డి సిహెచ్‌.ద్వారకా తిరుమల రావు వెల్లడించారు. ఈనెల 8 నుండి 12 తేదీ వరకు హైదరాబాద్‌ నుండి వివిధ ప్రాంతాలకు రెగ్యులర్‌గా నడిచే సర్వీసులతో పాటు అదనపు సర్వీసులు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం… హైదరాబాద్‌ నుండి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు రోజూ నడిచే 339 సర్వీసులతోపాటు 11వ తేదీన 302 ప్రత్యేక బస్సులు, 12వ తేదీన 206 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌ నుండి ఒంగోలుకు 38, ఏలూరుకు 20 బస్సులు, మచిలీపట్నంనకు 23, విజయవాడకు 45, గుంటూరుకు 18, నరసరావుపేటకు 26, నెల్లూరుకు 17, నంద్యాలకు19, విశాఖపట్నం 4 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌ బిహెచ్‌ఇఎల్‌, ఎంజిబిఎస్‌, ఇసిఐఎల్‌, జీడిమెట్ల , రాజీవ్‌ గాంధీ ఎయిర్‌ పోర్టు నుండి ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. అలాగే విజయవాడ నుండి విశాఖపట్నం, రాజమండ్రి, తిరుపతి, నెల్లూరు, కాకినాడ, ఏలూరు, ఒంగోలు, గుంటూరు తదితర ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు తిరుగుతున్నాయి. బెంగుళూరు నుండి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు 11వ తేదీన ఏర్పాటు చేసిన 323 బస్సులు, 12వ తేదీన ఏర్పాటు చేసిన 269 బస్సులు ఇప్పటికే తిరుగుతున్నాయి. రెగ్యులర్‌గా నడిచే బస్సులతోపాటు ఇవి అదనం. ఈప్రత్యేక బస్సులు కూడా సాధారణ ఛార్జీలతోనే నడుపుతున్నట్లు ఆర్‌టిసి ఎమ్‌డి వెల్లడించారు. అలాగే ఓటు వేసి తిరిగి ప్రయాణమయ్యే వారి కోసం కూడా ఇబ్బందులు లేకుండా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని ఆయా జిల్లాల ప్రజా రవాణా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

➡️